ఒకప్పటి ఇంటెటిజెన్స్ చీఫ్.. ప్రస్తుతం ముంబాయి సినీనటి కాదంబరి జత్వానీ ని అక్రమంగా తప్పుడు కేసులతో అరెస్టు చేయించి.. నిర్బంధించి వేధించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న పీఎస్సార్ ఆంజనేయులు కస్టోడియల్ విచారణలో రకరకాల చిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. పోలీసులు విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ముందే అంచనా వేసి, ఆయా ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పడం ద్వారా కేసులో ఇరుక్కుపోకుండా సేఫ్ గా ఉండవచ్చునో.. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు తరిఫీదు ఇచ్చిన పోలీసు బుర్రగా పీఎస్సార్ ఆంజనేయులుకు కీర్తి ఉంది. అలాంటి మేథావి.. తాను సొంతంగా ఇరుక్కున్న కేసులో మాత్రం సూటిగా సమాధానాలు ఎందుకు చెబతారు? అనేది ప్రజల అనుమానం. దానికి తగ్గట్టుగానే ఆయన విచారిస్తున్న పోలీసులకు ఇర్రిలవెంట్ సమాధానాలతో చిర్రెత్తిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
‘కాదంబరి జత్వానీ అరెస్టుతో అసలు తనకు ఎలాంటి సంబంధమూ లేదు’ అనే ఏకవాక్య ప్రకటన మీదనే.. పీఎస్సార్ ఆంజనేయులు ఫిక్సయిపోయారు. ఇక ఏం మాట్లాడినా సరే.. ఆ ఏకవాక్యానికి అనుగుణంగానే మాట్లాడుతున్నారు. అందుకే పోలీసులు అడిగిన ఏప్రశ్నకు కూడా ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా.. తన ఏకవాక్య తీర్మానపు పునాదుల మీదనే అనుబంధ వాక్యాలు పేరుస్తున్నట్టుగా వార్తలు గమనిస్తే అర్థమవుతుంది.
‘కాదంబరిని అరెస్టు చేయడానికి ముంబాయి వెళ్లిన పోలీసులకు నిధులు ఎవరు సమకూర్చారని నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆమె అరెస్టుతో నాకు సంబంధమే లేదని చెప్పా కదా’ అనేది విచారణలో పీఎస్సార్ సంధిస్తున్న ఎదురు ప్రశ్న. వారు ఏ పద్దుల నుంచి ఖర్చులకు నిధులు వాడారో.. వారిని అడిగితే తెలుస్తుంది గానీ.. నన్నెలా అడుగుతారని అంటున్నారు. అయితే ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటునుంచే నిధులు సమకూర్చినట్టుగా తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పినప్పుడు మాత్రం.. ఆయన ‘అబ్బే అదేం లేదు’ అంటూ పొడిమాటలతో సమాధానం దాటవేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండో రోజు విచారణలో దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులు 34 ప్రశ్నలు సంధించగా ఒక్కదానికి కూడా పీఎస్సార్ ఆంజనేయులు సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.
కనీసం గత అయిదేళ్ల కాలంలో తాను వాడిన ఫోన్ల గురించి కూడా ఆయన వివరాలు సరిగా చెప్పలేదు. తాను ఒక్కటే ఫోను వాడానని అంటున్న ఆంజనేయులు డిపార్టుమెంటు ఇచ్చిన నెంబరు ను వాడిన ఫోను గురించి అడిగినప్పుడు సరిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. విచారణలో ఇన్ని రకాల మెలికలు పెడుతూ.. మడత పేచీలతో పోలీసులనే ఇబ్బంది పెడుతున్న ఈ సీనియర్ ఐపీఎస్.. తిరిగి తనను కోర్టు ఎదుటకు తీసుకువెళ్లినప్పుడు మాత్రం.. పోలీసులు మళ్లీ మళ్లీ తనను కస్టడీ విచారణకు పిలిచినా సరే.. పూర్తిగా సహకరిస్తానని సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం. సహకరించడం అంటే.. ఎదురు ప్రశ్నలతో పోలీసుల్ని ఉక్కిరి బిక్కిరి చేయడమే అని ఈ ఐపీఎస్ ఫిక్సయినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.