డీజీపీ అలసత్వంపై హైకోర్టు అక్షింతలు!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు దగ్గరినుంచి, కిందిస్థాయిలో ఉండే అనేక మంది నాయకులు ఎన్నికల్లో పోటీచేయడానికి నామినేషన్లు వేసిన తర్వాత.. వారిపై అనర్హత వేటు పడేలా ప్రభుత్వం ఒక కుట్రరచన చేస్తున్నదా? ఆ కుట్రకు పోలీసుశాఖలోని ఉన్నతాధికారులనుంచి కూడా మార్మికమైన సహకారం అందుతున్నదా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ఏకంగా పోలీసు డీజీపీ ని ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటి సందేహాలకు ఊతమిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబునాయుడు సహా అనేక మంది తెలుగుదేశం నాయకుల మీద రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీసు స్టేషన్లలో వివిధ కేసులు నమోదు అయ్యాయి. వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఎన్ని పోలీసు కేసులు నమోదు అయ్యాయో కూడా లెక్కలేదు. ప్రతి కేసులోనూ పోలీసులు వారికి సమన్లు పంపారనే గ్యారంటీ కూడా లేదు. నిజానికి రాజకీయ నాయకులకు ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసినప్పుడు వారి మీద ఏయే పోలీసు కేసులు ఉన్నాయో చాలా వివరంగా పేర్కొనాలి. ఏ ఒక్క కేసు గురించి అఫిడవిట్ లో చెప్పకపోయినా సరే.. కేసు వివరాలు దాచిపెట్టి, మోసపూరితంగా నామినేషన్ వేసినట్టుగా పరిగణనలోకి వస్తుంది. దానివల్ల నామినేషన్ పూర్తిగా డిస్‌క్వాలిఫై అయ్యే ప్రమాదమూ ఉంటుంది. నిజానికి తెదేపా నాయకులమీద నమోదైన కేసులను పోలీసులు గుంభనంగా ఉంచేశారనే ఆరోపణ కూడా ఉంది.

మొత్తానికి నామినేషన్ సమయంలో ఇలాంటి సాంకేతికపరమైన ఇబ్బంది రాకుండా ఉండేందుకు .. తన మీద రాష్ట్రంలో ఏయే పోలీసు స్టేషన్లలో ఏయే కేసులు నమోదై ఉన్నాయో ఆ కేసుల వివరాలు అన్నీ ఇవ్వాలంటూ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర డీజీపీకి, వివిధ జిల్లాల ఎస్పీలకు కూడా చాలా రోజుల కిందట లేఖలు రాశారు.  అలాగే మరికొందరు తెలుగుదేశం నాయకులు కూడా ఇలాంటి లేఖలు రాశారు. వారిలో నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, నారాయణ, తదితరులు అనేకమంది ఉన్నారు. అయితే పోలీసులు ఆ వివరాలు ఇవ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. నెలరోజుల కిందట వినతిపత్రం ఇస్తే వివరాలు ఇవ్వకుండా ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహించింది. కేసుల వివరాలు ఇవ్వడానికి మీకెంత సమయం కావాలంటూ నిలదీసింది. ఏఐ పరిజ్ఞానం వాడితే రెండుమూడు గంటల్లోనే అన్ని కేసుల వివరాలు ఇవ్వవచ్చునని, ఈనెల 16వ తేదీలోగా మొత్తం అందరి మీద ఉన్న కేసుల వివరాలు అందించాలని ఆదేశించింది.

పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లయితే గనుక.. తెదేపా నాయకుల మీద అనర్హత వేటు పడేలా అధికార పార్టీ కుట్రరచనలో వారు భాగస్వాములు అవుతున్నట్లేనని పలువురు అభిప్రాపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories