మనం చాలా కాలనీల్లో టూలెట్ బోర్డులు పెట్టిన ఇళ్ల వద్ద ఒక చిత్రమైన పాయింటు గమనిస్తూ ఉంటాం. ఈ ‘ఇల్లు ఫలానా కులం వాళ్లకు మాత్రమే అద్దెకివ్వబడును’ అనే తరహా బోర్డులు కనిపిస్తుంటాయి. అలాగే, ‘శాకాహారులకు మాత్రమే’ బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. ఆ తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇక్కడ నాయకత్వం బాధ్యతలు రెడ్లకు మాత్రమే ఇవ్వబడును అని బోర్డు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నదేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీ పునర్ వ్యవస్థీకరణ అంటూ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్న అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రాంతీయ సమన్వయకర్తలను తాజాగా నియమించారు. మొత్తం 13 జిల్లాల బాధ్యతలు చూసేందుకు జగన్ ఏడుగురిని నియమిస్తే.. అందులో అయిదుగురు రెడ్లు మాత్రమే. ఆయన పార్టీ తీరును ఈ నియామకాలే ప్రతిబింబిస్తున్నాయని అంతా అనుకుంటున్నారు.
పార్టీని పునర్నిర్మిస్తానని అంటున్న జగన్.. సంస్థాగతంగా అన్ని కమిటీలను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లలో మార్పు చేర్పులు చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు గతంలో తప్పించిన విజయసాయిరెడ్డి చేతిలోనే మళ్లీ బాధ్యతలు పెట్టారు. బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వగా అవి తప్పించి గుంటూరు, చిత్తూరు జిల్లాలఠు అప్పగించారు. ఉభయ గోదావరి జిల్లాల బాధ్యత బొత్స సత్యనారాయణకు అప్పగించగా, కృష్ణా జిల్లా కు అయోధ్య రామిరెడ్డిని నియమించారు. కడప, కర్నూలు జిల్లాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కాయి. ఆయన కొడుకు మిధున్ రెడ్డికి నెల్లూరు, అనంతపురం జిల్లాలు అప్పగించారు. ప్రకాశం జిల్లాకు కారుమూరు నాగేశ్వరరావును తీసుకువచ్చారు.
ఈ ఏడుగురు రీజినల్ కోఆర్డినేటర్లలో బొత్స సత్యనారాయణ, కారుమూరు నాగేశ్వరరావు మాత్రమే నాన్-రెడ్డి నాయకులు. బొత్స సంగతి పక్కన పెడితే.. కారుమూరు నాగేశ్వరరావు వీర విధేయుడైన నాయకుడు.
జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ప్రతి బహిరంగ సభలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ పెద్దపెద్దగా అరుస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి బూటకపు నినాదాలు కూడా పార్టీని ఓటమి వైపు నడిపించాయనే విమర్శ ఒకటి ఉంది. ఇలా ‘నా’ అంటూ జగన్ కపట ప్రేమ కురిపిస్తున్నవారంతా కేవలం ఆయన ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న వారు మాత్రమే అని తాజా నిర్ణయాలను బట్టి అర్థమవుతోంది. పార్టీ మీద పెత్తనం చేయడానికి మాత్రం అందరూ రెడ్లే కావాలి. ఆ రెండు పోస్టులు కూడా ప్రజలు ఏడవకుండా ఉండేందుకు ఏదో కంటితుడుపుగా ఇచ్చారనే విమర్శలు పార్టీలోనే ఉన్నాయి. ఇలా ఏకపక్షంగా ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ పార్టీని జగన్ ఎలా నడుపుతారో అర్థం కావడం లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.