చంద్రబాబునాయుడు కేబినెట్ కూర్పులో తనదైన ముద్ర చూపించారు. అదే ముద్రను మంత్రులకు శాఖల కేటాయింపులో కూడా కొనసాగించారు. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తూ రికార్డు సృష్టించిన చంద్రబాబునాయుడు.. ఆ మేరకు పార్టీలో కొమ్ములు తిరిగిన ఎందరో సీనియర్లను కూడా పక్కన పెట్టిన చంద్రబాబునాయుడు.. శాఖల కేటాయింపులో విలక్షణంగా వ్యవహరించారు. వీటన్నింటిలో పవన్ కల్యాణ్ భుజస్కంధాల మీదనే గురుతర బాధ్యతలు పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది.
రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా హోదాను అందుకున్న పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతికత శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. రాష్ట్రం రూపురేఖలు మార్చడానికి గ్రామీణ వికాసానికి కీలకమైనవి. సీఎం ఎవరైనా సరే.. తమకు అత్యంత నమ్మకం ఉన్న వారి చేతిలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను పెడుతుంటారు. గతంలో చంద్రబాబు.. తన కొడుకు లోకేష్ చేతిలో ఈ శాఖలు పెట్టారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి చేతిలోపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు పవన్ కల్యాణ్ చేతిలో ఈ గురుతర బాధ్యతలు పెట్టడం విశేషం. రాష్ట్ర పురోగతిలో కీలకమైన సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఆయనకే కేటాయించారు.
మరికొన్ని విలక్షణ అంశాలేంటంటే.. అమరావతి రాజధాని నగర నిర్మాణంలో ఎంతో కీలకంగా నిలవగల పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖను తనకు ఎంతో నమ్మకం ఉన్న పొంగూరు నారాయణ చేతిలో పెట్టారు చంద్రబాబు. ఆయన గత ప్రభుత్వ హయాంలో కూడా అదే శాఖను నిర్వర్తించారు. ఆ మిష మీదనే.. అమరావతి నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని నారాయణకు ముడిపెట్టి వేధించడానికి జగన్ సర్కారు చాలా ప్రయత్నించి విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి నగర నిర్మాణం దానికి సంబంధించి పూర్వరంగంలో జరిగిన కసరత్తు మొత్తం మీద పొంగూరు నారాయణకు మంచి అవగాహన ఉంది. ఆ మంత్రిత్వశాఖ మళ్లీ ఆయనకే దక్కడం వలన.. అమరావతి నిర్మాణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖను బిజెపికి చెందిన సత్యకుమార్ కు కేటాయించారు. గతంలో కూడా ఇదే పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్ చేతిలో ఈ శాఖ ఉండేది.
హోంశాఖను వంగలపూడి అనిత చేతిలో పెట్టడం చంద్రబాబునాయుడు ప్రత్యేక ముద్రగా చెప్పుకోవాలి. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హాయంలో అనేక వేధింపులను ఎదుర్కొన్న మహిళానేత చేతికి హోంశాఖ కేటాయించారు. కేబినెట్ కూర్పు మాత్రమే కాదు.. శాఖల కేటాయింపు కూడా సూపర్ అని అందరూ శ్లాఘిస్తున్నారు.