నెయ్యి గోల్‌మాల్ కతలు వింటే గుండె గుభేలే!

తిరుమలేశుని ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీకి సంబంధించిన వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానాల అప్పటి ధర్మకర్తల మండలి సారథులు పీకలదాకా ఇరుక్కుపోయినట్లుగానే కనిపిస్తోంది. ఏ ఆర్ డెయిరీ వారికి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కడానికి.. అప్పటిదాకా అమలులో ఉన్న ఎన్ని నిబంధనలను సడలించారో, ఎన్ని అడ్డదారులు తొక్కారో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ ప్రజలు విస్తుపోతున్నారు. దేవుడి సొమ్మును అయినకాడికి దోచుకోవడానికి వైసిపి జమానాలోని టీటీడీ పాలకులు మరీ అంత నీచానికి ఒడిగడతారా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన అనేక విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి.

టీటీడీకి నెయ్యి సరఫరా చేయదలచిన డెయిరీ టెండర్ లో పాల్గొనాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. తిరుమలకు 800 కిలోమీటర్లకు మించని దూరంలోనే ఆ డెయిరీ ఉండాలి. అలాగే మూడేళ్లుగా వాళ్లు డెయిరీ వ్యాపారంలో స్థిరపడి ఉండాలి.

ఇలాంటి నిబంధనలను గత ప్రభుత్వంలో పాలకులు అడ్డగోలుగా మార్చేశారు. ఈ నిబంధనలను అన్నింటిని మార్చివేసిన తీరు గమనిస్తే- తమకు కావాల్సిన వారికి టెండర్ కట్టబెట్టడానికే చేశారనేది స్పష్టం అవుతుంది. పాల సేకరణ సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. అలాగే తిరుపతి నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో డెయిరీ ఉన్నా కూడా పరవాలేదన్నట్టుగా నిబంధన మార్చారు. మూడేళ్ల అనుభవం అనేదాన్ని ఒక ఏడాదికి కుదించారు. ఇన్ని రకాల మతలబులు చేస్తేనే ఏఆర్ డెయిరీకి కనీసం టెండర్‌లో పాల్గొనే అర్హత దక్కింది. ఇంత చేసినప్పటికీ కూడా తెలుగుదేశం హయాంలో ఉన్న టెండరుదారులను తప్పించడం కోసం జగన్ వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ విధానం ప్రకటించారు. అప్పట్లో వైష్ణవి డెయిరీ 420 రూపాయలకు సరఫరా చేస్తామని ప్రకటించి ఎల్1 గా నిలిచింది. 438 రూపాయలు కోట్ చేసి ఎల్3 గా నిలిచింది ఏఆర్ డెయిరీ! వైష్ణవి డెయిరీ ఇచ్చే ధరకే ఇచ్చేటట్లయితే 35శాతం కాంట్రాక్ట్ అప్పగిస్తామని టీటీడీ ప్రతిపాదించినప్పటికీ ఏఆర్ డెయిరీ ఒప్పుకోలేదు. ఇదంతా ఏడాది కిందటి సంగతి.

ఏడాది తిరిగేసరికి వారి వైఖరిలో మార్పు వచ్చింది. ఈసారి కేవలం రూ.320 మాత్రమే కోట్ చేసి పది లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్నారు. సరిగ్గా ఏడాది కిందట కిలో రూ.420కు ఇవ్వడం కూడా తమకు సాధ్యం కాదని వెనక్కు తగ్గిన డెయిరీ, ఇప్పుడు 320కే ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నది అనేది అతిపెద్ద సందేహం. అలాగే వైష్ణవి డెయిరీ వంటి ఇతర డెయిరీల నుంచి నెయ్యి ట్యాంకర్లను కొనుగోలు చేసి వాటిని తమ డెయిరీకి తెప్పించుకుని అక్కడ కల్తీ చేసి ఆ తరువాత తిరుమలకు పంపినట్లుగా కూడా అనేక ఆధారాలను ఆనం వెంకటరమణారెడ్డి బయట పెట్టారు. ఆయన బయట పెట్టిన విషయాలను గమనిస్తే టీటీడీ ధర్మకర్తల మండల గత పాలకులు ఈ పాపంలో పూర్తి భాగస్వాములు అనే సంగతి సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. మరి విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories