ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు పరిపాలన సాగించారు. కానీ ఎన్నడైనా సరే రోడ్డు పక్కన ఆగి ప్రజల నుంచి వెనకే పత్రాల స్వీకరించిన సన్నివేశాన్ని ఎవరైనా చూశారా? అసలు రోడ్డుమీద జగన్ ప్రయాణిస్తూ ఉండగా ఆయనను దర్శించుకునే భాగ్యమైనా ప్రజలకు కలిగిందా? జగన్ ఎప్పుడు ఏ ఊరిలో కార్యక్రమానికి హాజరైనా సరే, ఆయన ప్రయాణించే రోడ్లకు రెండు వైపులా గుంజలు పాతి, పరదాలు కట్టేసి, చెట్లను నరికేసి దుకాణాలను మూయించి నానా బీభత్సం సృష్టించి.. దొరవారిని అధికారులు తీసుకువెళ్లేవారు. ప్రజలు అందరూ తనకు శత్రువులు అన్నట్టుగా వారికి దూరంగా మెలగడమే తన జీవితం అన్నట్లుగా పరిపాలన హయాంలో జగన్ తీరు కనిపించింది. అప్పుడప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు నిర్వహించేవారు. అవి పూర్తిగా ఎంపిక చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతించే కార్యక్రమాలు. ఐప్యాక్ దళాలు తీసుకువచ్చిన వారిని, ముందే శిక్షణ పొందిన వారిని ఆ సమావేశాలలో కూర్చోబెట్టి.. జగన్మోహన్ రెడ్డిని కీర్తించడానికి పరిమితం చేసేవారు తప్ప, వాస్తవంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే ఏ కార్యక్రమమూ ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు తీరును గమనించిన వారు గత ఐదేళ్లలో ఇలాంటి దృశ్యాన్ని ఒక్కసారైనా చూసామా అని ఆశ్చర్యపోతున్నారు.
ఉండవల్లి నుంచి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరిన తర్వాత రోడ్డు పక్కగా ఆగి ఉన్న ప్రజలు గొంతే పిలవగానే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను ఆపు చేయించారు. కారు దిగి అక్కడ నిల్చుని ఉన్నవారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారికి ధైర్యం చెప్పారు. స్వయంగా సీఎం తమను చూసి కారు ఆపి దిగి వినతి పత్రాలు స్వీకరించడం మాత్రమే కాకుండా, భరోసా ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం! ఇలా రోడ్డు పక్కన వేచి ఉన్న వారిలో అరకులోయ మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ భార్య ఇచ్ఛావతి కూడా ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే శివేరి సోమను గతంలో నక్సలైట్లు కాల్చి చంపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ కుమారుడి విద్యాభ్యాసానికి ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరారు. సోమ కొడుకు చదువు బాధ్యత పూర్తిగా తాము తీసుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పి పంపారు.
ఇలా అసలు రోడ్డు పక్కన ప్రజలు నాయకుడి కోసం వేచి ఉంటే వారిని చూసి.. వాహన శ్రేణిని ఆపి, వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి, ధైర్యం చెప్పే అలవాటు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు- ఏ మంత్రి అయినా చేశారా అనేది ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో రోడ్డు పక్కన తనకోసం నిల్చుని ఉన్న వారి నుంచి కాన్వాయ్ ఆపి వినతి పత్రాల స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే పని చేస్తున్నారు. వీరు నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వలన ప్రజలు వీరిని మరింతగా ఆదరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.