ఇలాంటి మాటలు జగన్ నుంచి ఎన్నడైనా విన్నామా?

రాష్ట్ర ప్రజల సంక్షేమం చూడడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత! అధికారంలోకి వచ్చిన అందరూ ఈ మాటలనే వల్లె వేస్తుంటారు. కానీ ఎవరు ఏయే విధానాలను అనుసరిస్తున్నారు- అనేది చాలా కీలకం. జగన్ చెప్పిన మాటలు కూడా అవే. కాకపోతే ఐదేళ్ల పదవీకాలంలో సంక్షేమం అంటే ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం మాత్రమే అని జగన్ అనుకున్నారు. ఇతరత్రా ఎన్ని రకాలుగా ప్రజలను దోచుకున్నా పర్వాలేదు.. రకరకాల పథకాల పేర్లు చెప్పి.. బటన్ నొక్కి వారి జేబుల్లోకి డబ్బులు పంపుతుంటే తనకు ఓటు బ్యాంకుగా తయారవుతారని జగన్ కలగన్నారు. అంతే తప్ప ‘ప్రజల మీద భారం వేయకూడదు’ అనే దృష్టి ఎన్నడూ ఆయన పరిపాలనలో కనిపించలేదు.

తాజా పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ- ప్రజల మీద కొత్తగా ఎలాంటి భారం వేయలేమని అన్నారు. ఆదాయ వనరులు ఉన్న శాఖలే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంచడానికి ఆలోచనలు చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ సర్కారు  వ్యవహరించిన అస్తవ్యస్త విధానాల కారణంగా- ప్రజల జీవితం అతలాకుతలం అయిపోయి ఉన్నదనే సంగతిని ఆయన గుర్తు చేశారు. వారి జీవన ప్రమాణాలు పడిపోయాయని, అందుకే ప్రజల మీద కొత్త పన్నులు వేసి ఆదాయం పెంచే మార్గాలు కాకుండా- ఇతర పద్ధతుల ద్వారా ఆదాయం పెంచడం గురించి ఆలోచించాలని పిలుపు ఇచ్చారు.

సాధారణంగా ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవాలంటే ప్రజల మీద పన్నుల భారం మోపటమే తొలి మార్గంగా చూస్తుంటాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా పన్నులు పెంచడానికి వీల్లేదని చెప్పడం గమనార్హం. అందుకే ‘గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇలాంటి మాటలు ఎన్నడైనా విన్నామా’ అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ ప్రజలకు దాదాపుగా నిత్యావసరం వంటి ఇసుక ధరలను ఆకాశంలో ఉంచేశారు. ఏ రాష్ట్రప్రభుత్వానికైనా ప్రధాన ఆదాయవనరుగా ఉండే లిక్కరు వ్యాపారం విషయంలో ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తుందని ఒక మాయాపూరితమైన విధానం తీసుకువచ్చారు. లిక్కరు డిస్టిలరీలను అనధికారికంగా తమవారి గుప్పిట్లో పెట్టుకుని.. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి.. ఆ పెంచిన సొమ్ము మొత్తం ఆయా కంపెనీల నుంచి తన సొంత ఖజానాకు మళ్లించేసి ప్రజలను దోచుకున్నారు. చివరకు చెత్తనుకూడా వదలకుండా పన్నులువేసి ప్రజలను వేధించారు. మరి అలాంటి పాలన చూసిన తర్వాత.. ‘ప్రజల మీద పన్నులు వేయలేం.. ఆదాయం పెరగడానికి ఇతర మార్గాలను అన్వేషించండి’ అని చెప్పే ముఖ్యమంత్రి దొరకడం నిజంగా గొప్పవిషయమే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories