వైసీపీలో నేతలకు గతిలేకుండా పోయిందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలకు గతిలేకుండా పోయిందా? లేదా, తాను వ్యవస్థీకరించిన కొత్త జిల్లాల ఏర్పాటు మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే నమ్మకం సడలిపోయిందా? అనేది అర్థం కావడం లేదు. పార్టీని పునర్ వ్యవస్థీకరించే పని అన్నట్టుగా జగన్ రకరకాల కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగా.. జిల్లాల్లో కొత్త పార్టీ అధ్యక్షులను నియమించే పనిలో పడ్డారు. అయితే తన పరిపాలన రోజుల్లో రాష్ట్రాన్ని చిన్న జిల్లాలుగా విభజించి.. పార్టీ యూనిట్లను కూడా ఆ మేరకు కొత్త కమిటీలు వేసిన జగన్ ఇప్పుడు కొత్తగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు కొత్త సారథులను నియమించే ప్రయత్నంలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? చిన్న జిల్లాలకు అధ్యక్షులను నియమించే స్థాయిలో ఆ పార్టీకి నాయకులకు గతి లేకుండా పోయిందా అనే  సందేహం కలుగుతుంది.

ఉమ్మడి ప్రకాశంజిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పతనం అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ఒంగోలు జిల్లా పార్టీ సారథ్యం పుచ్చుకోవాలని మామయ్య బాలినేనిని, జగన్ బతిమాలినా వర్కవుట్ కాలేదు. చిత్తూరు విషయానికి వచ్చేసరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా సారథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు జగన్. ప్రకాశం జిల్లా మాదిరిగానే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ రెండే సీట్లు గెలిచింది. కాకపోతే.. ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లిని పార్టీ సారథి చేద్దాం అనుకుంటే.. మిగిలిన లీడర్లంతా వ్యతిరేకించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా పెత్తనాన్ని మాత్రం పెద్దిరెడ్డి చేతుల్లోనే పెట్టారు.

ఈ దెబ్బతో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఉన్న హోదా పోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్త సారథిని వెతకాల్సిన అవసరం ఏర్పడింది.

చిన్న జిల్లాలను జగన్ స్వయంగా ఏర్పాటుచేసి.. కనీసం ఆ జిల్లాల లెవెల్లో పార్టీకి అధ్యక్షులను నియమించలేకపోతున్నారంటే.. ఆ పార్టీ ఎంతగా నాయకుల కొరతతో సతమతం అవుతున్నదో కదా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories