కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ డోర్లు క్లోజ్ అయ్యాయా?

తమ కుటుంబపార్టీలో కొనసాగే వాతావరణాన్ని పూర్తిగా దూరం చేసుకున్న నాయకురాలు కల్వకుంట్ల కవిత తన అస్తిత్వ రక్షణ కోసం ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. భారత రాష్ట్ర సమితికి ఇప్పటిదాకా రాజీనామా చేయకపోయినప్పటికీ.. తన ఇంటి పార్టీతో ఆమెకు తెగతెంపులు అయిపోయినట్టే లెక్క! అయితే రాజకీయ మనుగడ కోసం ఆమెకు కాంగ్రెసుతో చేతులు కలపడం తప్ప వేరే గత్యంతరం లేదనే ప్రచారం చాలా కాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చూడబోతే.. ఇప్పుడు కాంగ్రెస్ తో కలవగల అవకాశాలను కూడా ఆమె కోల్పోతున్నట్టు, కాంగ్రెస్ డోర్లను ఆమె స్వయంగా మూసేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. సుదీర్ఘ అధ్యయనం తరువాత.. కొత్త ఫార్మాట్ లో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను.. కాంగ్రెస్ తల్లి విగ్రహాలుగా గేలిచేస్తూ, వాటిని గాంధీభవన్ కు పంపుతామని కవిత చేస్తున్న దూకుడైన వ్యాఖ్యలు.. ఇలాంటి అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి.

కల్వకుంట్ల కవితకు భారతీయ జనతా పార్టీ అంటే ఒకరేంజిలో మంట ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాను పాల్పడిన అవినీతి గురించి జంకు లేదు గానీ.. ఆ నేరానికి అరెస్టు అయి జైల్లో ఉండాల్సి వచ్చినందుకు ఏర్పడిన మంట అది. ఆమె అరెస్టు సమయంలో.. కేటీఆర్ మరియు కేసీఆర్ తరఫు దూతలు.. బిజెపిలోని కీలక నాయకుల్ని సంప్రదించి..కల్వకుంట్ల కవితను విడుదల చేస్తే, కేసులు లేకుండా సహకరిస్తే.. భారాసను, భాజపాలో విలీనం చేస్తామనే ప్రతిపాదన పెట్టినట్టుగా వార్తలు వచ్చిన తర్వాత.. కల్వకుంట్ల కవితకు ఆ మంట పెరిగింది. మొత్తానికి కేసీఆర్ దళాలు ఆమెను పూర్తిగా దూరం పెట్టాయి. అన్నయ్య కేటీఆర్ తో రాఖీ కట్టడాన్ని కూడా మానుకునేంతగా వైరం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత గతిలేక, కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ గణను భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తూ దుమ్మెత్తిపోస్తుండగా, అదంతా సవ్యంగానే ఉన్నదని కవిత కితాబులివ్వడం ఇలాంటి ప్రచారాలకు ఊతం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను చేర్చుకోవడానికి సుముఖంగానే ఉన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ డోర్లు క్లోజ్ అయ్యాయేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను, కాంగ్రెస్ తల్లి విగ్హాలుగా ఎద్దేవా చేస్తూ కవిత తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారాసతో కూడా పొసగకుండా, ఆ పార్టీకి రాజీనామా చేయకుండా.. అక్కడి కార్యకర్తలను తన వద్దకు పిలిచి.. గులాబీ రంగు కనిపించనివ్వకుండా, తెలంగాణ జాగృతి అనే ముసుగుకింద రాజకీయ అస్తిత్వ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న కవిత.. కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించాలని పూనుకోవడం ప్రజలకు చేస్తున్న ద్రోహం అని అంటున్నారు.  మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ విగ్రహాలను తొలగించి.. గాంధీభవన్ కు పంపుతాం అని ఆమె హెచ్చరిస్తున్నారు. ఆమె ఇలాంటి ప్రతిజ్ఞలు చేయవచ్చు గానీ.. కనీసం బిఆర్ఎస్ లో ఆమెకు చోటు మిగిలిఉన్నదా.. అనేది మొదటి సందేహం. అలాగే.. కాంగ్రెస్ లో చేరగల అవకాశాలను ఈ మాటలతో మంటగలుపుకున్నట్టేనా అనేది రెండో సందేహం! మరి కవిత భవిష్యత్తు ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories