వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని ఆరాటపడుతున్నారా? ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. కనీసబాధ్యతగా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం పట్ల ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే ప్రబలుతున్న అసంతృప్తి జగన్మోహన్ రెడ్డిని నిలువనీయడం లేదా? అందుకే ఆయన ఎలాగైనా సరే.. అసెంబ్లీకి వెళ్లాలని.. అయితే అదే సమయంలో తన అహంకారానికి భంగం కలగకుండా చూసుకోవాలని అనుకుంటున్నారా? తాజా పరిణామాలను, సాక్షిమీడియా కొత్తగా ప్రారంభించిన ఒక దుష్ప్రచారాన్ని గమనిస్తే.. అదే మనకు అర్థమవుతుంది.
నిరంతరం చంద్రబాబునాయుడు మీద బురద చల్లడం, విషం కక్కడంలో మాత్రమే తరించిపోతూ ఉండే సాక్షి మీడియా కొత్తగా ఒక పాట ప్రారంభించింది. కూటమి ప్రభుత్వంలోని మార్పు చేర్పుల మీద వారి కుట్రలను అమల్లో పెట్టడం ప్రారంభించారు. కుదురుగా నడుస్తున్న కూటమి సర్కారులో చిచ్చు పెట్టడం వారి లక్ష్యంగా కనిపిస్తుంది. కానీ.. ఆ లక్ష్యం వెనుక మరింత విస్తృతమైన అంతరార్థం కూడా ఉన్నట్టుగా విశ్లేషకులు అనుమానాలు ఉన్నాయి. ఇంతకూ సాక్షి చేస్తున్న దుష్ప్రచారం ఏమిటి?
ప్రస్తుత అసెంబ్లీ స్పీకరు అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు ఇద్దరూ కూడా మంత్రి పదవులకోసం చంద్రబాబునాయుడు మీద ఒత్తిడి తెస్తున్నారట. పార్టీలో ఎంతో సీనియర్ అయిన అయ్యన్న పాత్రుడు, అలాగే చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యం ఉన్న రఘురామక్రిష్ణరాజు ఇద్దరూ మంత్రి పదవులకోసం పట్టబడుతున్నట్టుగా వీరి ప్రచారం ప్రారంభమైంది. ఆ ఇద్దరు నాయకులు ఆ పదవులకు వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తూ ఉండగా.. అసలు ఆ రకమైన వాదన వారికి ఎలా స్ఫురించిందో తెలియదు గానీ.. ఆ పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే ఈ కుట్ర ప్రచారం వెనుక జగన్ మంత్రాంగం మరొకటి ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు, రఘురామక్రిష్ణ రాజు ఇద్దరూ కూడా గత అయిదేళ్లకాలంలో జగన్మోహన్ రెడ్డి లోపాలను చాలా నిష్కర్షగా ఎత్తిచూపించిన నాయకులు. ఒక రకంగా చెప్పాలంటే.. జగన్ కు పక్కలోబల్లెంలా మారి.. ఆయన కంటికి నిదుర లేకుండా చేశారు. జగన్ వారి మీద విపరీతంగా కక్ష కట్టారు. రఘురామను తప్పుడు కేసుతో అరెస్టు చేయించి.. హత్యాప్రయత్నం కూడా పోలీసుల ద్వారా చేయించారు గానీ.. ఆయన కుట్రలనుంచి బయటపడ్డారు. అయ్యన్నపాత్రుడును కూడా అరెస్టు చేయించి వేధించాలని చాలా కుట్రలు చేశారు. అవన్నీ న్యాయస్థానాల ఎదుట తేలిపోయాయి. అలాగని వారు మాత్రం జగన్ పై తమ దూకుడు తగ్గించలేదు. వారిద్దరూ స్పీకరుగా, డిప్యూటీ స్పీకరుగా ఉండగా.. సభలో అడుగుపెట్టే ఉద్దేశం జగన్ కు లేదు.
అసెంబ్లీకి హాజరు కాకుండా ఆరునెలలు గడిస్తే డిస్ క్వాలిఫై అవుతారనే నిబంధన ఉంది. అలాగని పదవిని కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి ఓసారి వెళ్లివస్తే పరువు పోవడం గ్యారంటీ. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరిని ఆ స్థానంలో లేకుడా చేయడానికి జగన్ కుట్రలు చేస్తున్నారు. వారిని మంత్రి పదవుల్లోకి పంపేలా చక్రం తిప్పితే గనుక.. వాళ్లిద్దరూ సభలో ఆ స్థానాల్లో లేకపోతే.. తాను సభకు వెళ్లవచ్చునని జగన్ అనుకుంటున్నట్టుగా భోగట్టా. తాను అడుగుతున్నట్టుగా ప్రతిపక్ష నేత హోదా రావడం అసాధ్యం. ఆ సంగతి ఆయనకు తెలుసు. అలాగని వెళ్లకపోతే.. ప్రజలు ఛీత్కరించుకుంటారని భయం. అందుకే ఇలాంటి వక్రప్రచారాలు ప్రారంభించారని అంతా అనుకుంటున్నారు.