ఎప్పటినుంచో జగన్ వెన్నంటి ఉన్నవారు, జగన్ భక్తులు, వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తులు, జగన్ తమ జీవితం అని ప్రకటించిన వారు.. ఇలా రకరకాల కేటగిరీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆయనతో బంధుత్వం ఉన్న వారికి కూడా ఇవాళ ఆయన పార్టీ పనికిరాదనే స్పృహ కలుగుతోంది. ఆ పార్టీనుంచి ఇందరు నాయకులు వెళ్లిపోతుండగా.. ఏదో రాజకీయ అవసరం కోసం, అవకాశవాద సిద్ధాంతం ప్రకారం అధికారం ఉన్నప్పుడు.. వలస వచ్చి ఆ పార్టీలో చేరిన వారు మాత్రం ఎందుకు ఇంకా కొనసాగుతారు? నిజానికి వారు ఇంకా ముందే గుడ్ బై కొట్టేసి ఉండాల్సింది. కానీ జగన్ అంటే వారికి ఇప్పటికి వెగటు పుట్టినట్టుగా కనిపిస్తోంది. రాజోలు మాజీ ఎమ్మెల్యే.. జనసేననుంచి ఫిరాయించి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాదరావు తాజాగా ఆ పార్టీలో కొనసాగేది లేదని ప్రకటించేశారు.
రాపాక వరప్రసాద్ ను నిజానికి వెన్నుపోటు ఎమ్మెల్యే అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. అది రాజోలు నుంచి రాపాక మాత్రమే. జనసేన పార్టీకి రాజకీయ బోణీ అని చెప్పుకోగల ఘనత లేకుండా.. ఆయన గెలిచిన వెంటనే ఫిరాయించి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటినుంచి జగన్ విధేయుడిగానే కొనసాగుతూ వచ్చారు. ౌ
కానీ 2024 ఎన్నికల సీజను వచ్చేసరికి నియోజకవర్గాల్లో ఓటమి సంకేతాలు స్పష్టంగా తన సర్వేల్లో బయటపడుతున్నప్పటికీ.. అవి తనను గద్దెదించడానికి ప్రజలు చేసుకున్న కృతనిశ్చయం అని గుర్తించకుండా.. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నదని ఆత్మవంచనతో కూడిన మాటలు చెప్పుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమందిని మార్చారు. ఆ మార్పులలో రాపాక వరప్రసాద్ ను కూడా మార్చారు. జగన్ ను నమ్మి వస్తే టికెట్ ఎగ్తొట్టి గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. రాపాకను బలవంతంగా ఎంపీగా పోటీచేయించారు. తెలుగుదేశం హవాలో వారంతా కొట్టుకుపోయారు.
తీరా ఇప్పుడు రాపాక ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీలో కొనసాగబోవడం లేదని, ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని ప్రకటించేశారు. ఆయన తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ఉన్నది గానీ.. ఆపార్టీలో పొసగగలరా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.