అమరావతిలో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. మొత్తం 1200 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఒక్క చాన్స్’ అనే వంచనాత్మకమైన మాటతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపించినట్టే.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేశారు. అమరావతి మీద కక్ష కట్టినట్టుగా.. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసే యజ్ఞం చేసిన జగన్.. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా అదే చేశారు. అప్పట్లో ఫ్లాట్లు కొన్న వారి నమ్మకం మీద నీళ్లు చిలకరించారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి రాగానే.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించేస్తున్నారు. ఈమేరకు అధికారుల్ని ఆదేశించారు. అప్పుడు ఫ్లాట్లు కొన్నవారికి ఎలాంటి భారం పడకుండా ఒక అద్భుతమైన వరం కూడా ప్రసాదించారు.
2018లో హ్యాపీనెస్ట్ ఫ్లాట్ల బుకింగ్ సందర్భంగా ఏ ధరకైతే విక్రయించామో.. ప్రజలు కొన్నారో.. అదే ధరకు వారికి ఫ్లాట్లు పూర్తిచేసి అందించాలని చంద్రబాబు ఆదేశించడం విశేషం. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన నిర్మాణ వ్యయాన్ని సీఆర్డీయేనే భరించాలని చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును జగన్ సర్కారు అయిదేళ్ల పాటు పట్టించుకోకుండా వదిలేయడం వలన నిర్మాణ వ్యయం అప్పట్లో ప్లాన్ చేసిన 714 కోట్ల నుంచి 930 కోట్లకు చేరినట్టు అధికారులు తెలియజేశారు. ఆ వ్యత్యాసం 216 కోట్ల వ్యయాన్ని సీఆర్డీయేనే భరించాలని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. వారికి అప్పట్లో విక్రయించిన ధరకే పూర్తిచేసి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు ఆదేశించడం విశేషం.
అప్పట్లో చంద్రబాబునాయుడు హ్యాపీనెస్ట్ పేరుతో 1200 ఫ్లాట్ల ప్రాజెక్టును ప్రకటించారు. వాటి ద్వారా.. నివాసాలు పెరిగి.. రాజధాని ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశించారు. ప్రాజెక్టు బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం అన్నీ అమ్మకాలు అయిపోయాయి. కానీ తర్వాత జగన్ సర్కారు రావడంతో ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది.