గులకరాయే గుదిబండ : వేటు పడింది!

జగన్ మీద చిన్న గులకరాయి పడి గాయమైతే.. దానికి హత్యాయత్నం కేసు నమోదు చేసి.. ప్రచారపర్వం రాజకీయాల్లో కామెడీ ఎపిసోడ్ ను సృష్టించిన ఐపీఎస్ అధికారి విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా మీద వేటు పడింది. ఆయనతో పాటు నిఘావిభాగాధిపతిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా విధులనుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరికీ ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించకుండా చూడాలని ఆదేశించింది.


చూడబోతే.. జగన్ మీద పడిన గులకరాయి.. దర్యాప్తులో జగన్ భక్తిని అమితంగా ప్రదర్శించిన కాంతిరాణా టాటా పాలిట మెడలో గుదిబండగా మారినట్టు కనిపిస్తోంది. కాంతిరాణా, ఆంజనేయులు ఇద్దరి పాత్ర గురించి చాలాకాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. అనేక పర్యాయాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇవన్నీ పెండింగులో ఉండగానే గులకరాయి కేసు తెరమీదకు వచ్చింది. తెలుగుదేశానికి చెందిన వారిని బలవంతంగానైనా సరే కేసులో ఇరికించాలని పోలీసులు ప్రయత్నించినట్లుగా అనేక విమర్శలు వచ్చాయి. తెదేపా నాయకుడు దుర్గారావును అరెస్టు చేయడం, బోండా ఉమా పేరు చెప్పాల్సిందిగా వేధించడం, చివరకు ఆయన పాత్రను నిరూపించలేక వదలిపెట్టడం జరిగింది. ఈ చర్యలన్నీ చాలా వివాదాస్పదం అయ్యాయి. కాంతిరాణా వ్యవహరించిన తీరు, అధికార పార్టీ నాయకుడిలాగానే.. ఆయన మాట్లాడుతూ వచ్చిన తీరు ఇవన్నీ కూడా చర్చనీయాంశం అయ్యాయి. తీరా ఇప్పుడు ఈసీ కాంతిరాణాతో పాటు, ఆంజనేయులు మీద కూడా వేటు వేసింది.

అలాగే పీఎస్ఆర్ ఆంజనేయులు గురించి కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. ఆయన ప్రతిపక్షాలను అణచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయిస్తున్నారని, ఆ సమాచారాన్ని అధికార పార్టీకి చేరవేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలకు సంబంధించినకదలికలను, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారనే ఫిర్యాదులు ఆయన మీద వచ్చాయి. వెరసి ఇప్పుడు వేటు పడింది.

వీరితో పాటు చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న సీఐ గంగిరెడ్డి మీద కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణం బదిలీచేసి, హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్ చేయాలని సూచించింది. ఆయన చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిపై వేటు వేయడంతో పాటు తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపుకార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో అవకతవకలు, దొంగఓట్లు పడడానికి కారకులంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి గిరీశా పనితీరుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని  కూడా ఈసీ ఆదేశించడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories