గులకరాయి హత్యాయత్నం.. కేసు సెక్షన్లు మారుతాయా!

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నుదుటిమీద గులకరాయి చేసిన గాయం కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. నిన్నటిదాకా క్యాట్ బాల్ తో రాయిని విసిరారని, ఎయిర్ గన్ తో ప్రొఫెషనల్స్ తో షూట్ చేయించారని రకరకాల కథనాలు ప్రచారంలో పెట్టారు. అంత తీవ్రమైన దాడి చేసిన కారణంగా 307 సెక్షన్ కింద హత్యాయత్నం  కేసులు నమోదు చేశారు. రాయివచ్చి తగిలినందుకు అలాంటి సెక్షన్ కింద కేసులుపెట్టడం చర్చనీయాంశం అయింది. అయితే ఎయిర్ గన్ తో షూట్ చేయడం వంటి కారణాలు చెప్పారు. కానీ, తాజాగా విజయవాడ నగర పోలీసు కమిషనర్ వెల్లడించిన వివరాలను గమనిస్తోంటే.. కేసు సెక్షన్లు మార్చవచ్చునేమో అనే అభిప్రాయం కలుగుతోంది.

పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చాలా ముమ్మరంగా సాగిస్తున్నారు. ఆ ప్రాంత పరిధిలో ఉండే సెల్ ఫోన్ డంప్ ను సేకరించి.. ఒక నెంబరు నుంచి ఎక్కువ కాల్స్ మాట్లాడిన వారి డేటాను సేకరిస్తున్నారు. ఇప్పటిదాకా మీడియాలో చెలామణీ అవుతున్న వీడియోక్లిప్ లను మాత్రమే కాకుండా, సభలో ఉండి, జగన్ ను వీడియో తీస్తూ ఉండిన సాధారణ ప్రజల ఫోన్లలోంచి కూడా వీడియోలను సేకరించి.. రాయి విసిరిన వ్యక్తి నిల్చున్నట్టుగా భావిస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తానికి కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి బలంగా రాయి విసిరినట్టు గుర్తించాం అని ప్రకటించడం విశేషం.

అంటే ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎయిర్ గన్, లేదా క్యాట్ బాల్ వాడడం అనేది జరగలేదన్నమాట. ప్రొఫెషనల్స్ తో చేయించిన హత్యా ప్రయత్నం లాంటిది అనే ప్రచారం దీనితో తేలిపోయినట్టే. చేత్తో రాయి విసిరి వ్యక్తిని చంపేస్తారనేది హాస్యాస్పదంగా ఉంటుంది. చేత్తోనే రాయి విసిరారని గుర్తించినట్టు సీపీ చెబుతున్నందున.. కేసు నమోదు చేసిన సెక్షన్లను కూడా మార్చవచ్చునని ప్రచారం జరుగుతోంది.

పైగా హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టడం విమర్శలకు గురవుతోంది. గతంలో చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుగా నిలవడంతో అతని గడ్డానికి తీవ్రమైన గాయం అయింది. అప్పట్లో తెలుగుదేశం వాళ్లు కేసు పెడితే.. 324 సెక్షను కింద కేసు పెట్టారు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి అనే సెక్షను కిందకి అది వస్తుంది. అలాకాకుండా జగన్ మీద ఇంకా చిన్న రాయి పడే సరికి హత్యాయత్నం కింద కేసు పెట్టడం చోద్యంగా ఉంది. కొన్ని రాళ్లు సంఘటన స్థలంలో దొరికాయని, ఏ రాయి వచ్చి తగిలిందో ఇప్పుడే చెప్పలేమని కాంతిరాణా అంటున్నారు. మొత్తానికి పోలీసులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోడానికి కేసు సెక్షన్లు మార్చవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories