గులకరాయి కేసు : ఇరికించే కుట్ర వికటించింది!

‘‘ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన కేసులో అతడిని ఇరికించడానికి మార్గాలు సులభంగా కనిపిస్తున్నాయని భావించారు. ఒకడిని ఇరికించేస్తే.. అతడి ద్వారా.. తెలుగుదేశం పెద్దల పేర్లు కూడా తాము కోరుకున్నట్టుగా చెప్పించవచ్చునని భావించారు. అక్కడితో కేసు క్లోజ్ అవుతుందనేది తమ ఆలోచన అయితే.. తెలుగుదేశాన్ని దోషిగా నిలబెట్టేస్తే జగన్ కళ్లలో ఆనందం చూడవవచ్చునని కూడా అనుకున్నారు. తీరా వారి కుట్ర ప్రయత్నాలు మొత్తం బెడిసి కొట్టాయి.. ఏ నేరమూ చేయని వాడిని అయిదురోజుల పాటు నిర్బంధించినా.. ఏమీ నిరూపించలేక చివరికి విడిచిపెట్టాల్సి వచ్చింది..’’ ఇదీ.. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల దుర్గారావు నిర్బంధం, అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సాగించిన ఆందోళన అనే  ఎపిసోడ్ మొత్తం గమనించిన వారికి కలుగుతున్న అభిప్రాయం.

జగన్ మీద రాయివిసిరినది వేముల సత్తి అంటూ అరెస్టు చూపించిన పోలీసులు, సత్తితో ఆ పని చేయించినది వేముల దుర్గారావు అనే తెలుగుదేశం కార్యకర్తగా అనుమానించారు. అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కుటుంబానికి ఆచూకీ కూడా చెప్పలేదు. కుటుంబసభ్యులు పలువిడతలుగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా కూడా.. సూత్రధారులుగా తమ పేర్లు చెప్పాలని నిందితులను టార్చర్ పెడుతున్నారంటూ బహిరంగ ఆరోపణలు చేశారు. పోలీసుల వైపు నుంచి చలనం రాలేదు. కాగా, దుర్గారావు ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

రోడ్డు మీద కొట్టులో టీ తాగుతుండగా పట్టుకెళ్లిన తనను, మీ వెనుక ఎవరు ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నించారని దుర్గారావు చెబుతున్నాడు. నేను ఏ తప్పూ చేయనప్పుడు వెనుక ఎవరుంటారంటూ చెప్పానన్నారు. వేముల సతీష్ జగన్ మీద రాయి విసిరితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నావట కదా.. అని అడిగితే.. అసలు సతీష్ తో పరిచయమే లేదన్నాను.. అంటూ దుర్గారావు మీడియాకు వివరించారు. అతని మాటలను బట్టి సతీష్, దుర్గారావు లను సీసీఎస్ పోలీసు స్టేషన్లో విడివిడిగా పక్కపక్క గదుల్లో పెట్టి, మరియు, ఇద్దరినీ కలిపి విచారించినప్పటికీ.. దుర్గారావు కు సంబంధం ఉందని పోలీసులు నిరూపించలేకపోయినట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం కార్యకర్త అయిన దుర్గారావును తెరవెనుక సూత్రధారిగా, రాయివిసరడానికి డబ్బులు ఇస్తానన్న వ్యక్తిగా ఇరికించగలిగితే.. ఆ తర్వాత అతని వెనుక తెలుగుదేశం పెద్ద తలకాయలు ఉన్నాయని నిరూపించడం కష్టంకాదు అని పోలీసులు అనుకుని ఉండొచ్చు గానీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories