జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలరేగి, ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారో, ఎన్ని రకాల దోపిడీలు కొనసాగించారో లెక్కేలేదు! ఆ క్రమంలో దేవస్థానాలకు చెందిన ఆస్తులు దిగమింగడం ఒక భాగం మాత్రమే!! గుడిలో లింగాన్నీ గుడినీ కూడా మింగేయగల కబ్జాకోరులు విచ్చలవిడిగా వ్యవహరించారు.
ఆలయ అధికారులను బెదిరించి, ప్రలోభ పెట్టి, మభ్యపెట్టి, రకరకాలుగా లోబరుచుకుని వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏ స్థాయిలో దందాలు కొనసాగించారో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో, అన్యాకాంతం అయిన భూకబ్జాల వ్యవహారాల మీద ఇప్పుడు లోతైన విచారణ జరగబోతోంది. ఇన్నాళ్లు దేవుడి సొత్తును దిగమించిన ఘనులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు.
వైసీపీ హయాంలో దేవాలయ భూములకు కూడా గ్రహణం పట్టిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న ఆలయాలకు ఉండే భూములను కూడా లీజు పేరుతో దోచుకోవడానికి… నామమాత్రం రుసుములు ఇచ్చేలా అనేక వ్యవహారాలను వైసీపీ నేతలు నడిపించారు. చంద్రబాబు సర్కారు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆక్రమణలన్నింటి లెక్క తేల్చాలని ఆదేశించినప్పటికీ.. అధికారుల్లో మాత్రం పెద్దగా స్పందన రాలేదు. ఆయన మళ్లీ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. కదలిక మొదలైంది.
సర్కారు మారిందే తప్ప.. జగన్ భక్తితో అక్రమాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్న కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మంత్రులు, నాయకులే.. ప్రతి ఒక్కరినీ అదిలించి ముందుకు నడిపించాల్సి వస్తోంది. ఇప్పుడు సాక్షాత్తూ మంత్రి వెంటపడుతుండడంతో.. ఆలయ భూముల అక్రమాలు మొత్తం ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంది.