శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం విషయంలో కొత్తగా ముసలం పుట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భవిష్యత్తు కనిపించకపోవడంతో, ఆ పార్టీ తనను పట్టించుకోకపోవడంతో అలిగి కొన్ని నెలల కిందట తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు- ఇప్పుడు తనకు టికెట్ కావాలని పట్టుపడుతున్నారు. ఆయన అసంతృప్తి, వర్గాన్ని కూడగడుతున్న ప్రయత్నాలు.. పార్టీకి ముసలంగా మారుతాయా? అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్ ను అభ్యర్థిగా తెలుగుదేశం ఎంపిక చేసింది. సుధీర్ గత ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు. అప్పటినుంచి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. ప్రజలతో టచ్ లో ఉంటూ పార్టీని కాపడుకురావడంలో ముందున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కూడా ఆయన కొడుకుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈ అయిదేళ్ల వ్యవధిలోనే బొజ్జల కుటుంబంలో ఇద్దరు కీలక నాయకులు మరణించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆయన పెద్దకర్మ రోజునే.. ఆయన తమ్ముడు హరినాధరెడ్డి కూడా మరణించారు. వీరిద్దరూ నియోజకవర్గంలో బలమైన నాయకులు కావడంతో.. వారి మరణాల వలన ఉండగల సానుభూతి కూడా సుధీర్ రెడ్డి విజయానికి ఉపయోగపడుతుందని ఒక అంచనా. ఇన్ని సమీకరణాల మధ్య ఆయనకు అభ్యర్థిత్వం దక్కింది.
అయితే ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉంటూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎస్సీవీనాయుడు, ఇప్పుడు హఠాత్తుగా తెరమీదికి వచ్చి ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నారు. కావాలంటే నియోజకవర్గంలో మళ్లీ పార్టీ సర్వే చేయించాలని, సర్వే ఖర్చులు కూడా తానే ఇస్తానని అంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య తదితరులను పోగేసుకుని తన వర్గంగా చూపించుకుంటున్నారు. బిజెపి, జనసేనకు నియోజకవర్గాన్ని కేటాయించినా.. వారి విజయానికి సహకరిస్తానని అంటున్న ఎస్సీవీ నాయుడు.. సుధీర్ రెడ్డికి ఇస్తే మాత్రం సహకరించనని అంటున్నారు. రాజకీయాల్లో ఇది తన చివరి అవకాశం అనుకుంటున్నానని, తనకు టికెట్ ఇస్తే, ఈ టర్మ్ తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుని ఆధ్యాత్మికంగా న గడపాలని అనుకుంటున్నానని చెబుతున్నారు.
రిటైర్మెంట్ కావాలని అనుకుంటున్న నాయకుడు, ఎటూ రిటైరవుతాను కదా.. అని గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకుంటారనే గ్యారంటీ ఏమిటి అనేది ప్రజల్లో సందేహం. మొత్తానికి కొన్ని నెలల కిందటే పార్టీలోకి వచ్చిన ఎస్సీవీ.. తెలుగుదేశానికి ముసలంలా మారుతున్నారు.