అవినాష్ రెడ్డిపై సర్కార్ స్ట్రెయిట్ ఎటాక్!

చాటు మాటు విమర్శలు చేయడం.. తాము చేయదలచుకున్న విమర్శలను ఇతరులతో చేయించడం.. పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచిచూడడం.. ఇలాంటిదేం లేదు! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం స్ట్రెయిట్ ఎటాక్ కు దిగింది. ఆయన కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు విచారణను తప్నుదోవ పట్టించడానికి చూస్తున్నారని ఆరోపించింది. ఆయన మార్దదర్శకత్వంలోనే సీబీఐ ఎస్పీ రాంసింగ్, వైఎస్ వివేకా కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ల మీద కేసు నమోదు అయిందని రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.

అవినాష్ రెడ్డి తన మాట వినే రిటైర్డు పోలీసు అధికారులను వాడుకుంటూ, విచారణాధికారులను బెదిరిస్తూ.. ఏ రకంగా వివేకా హత్యకేసు తారుమారు చేయడానికి ప్రయత్నించారో, మసిపూసి మారేడు కాయ చేయడానికి దిగజారారో.. పత్రాలతో సహా సవివరంగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది.
సిబిఐఎస్పి రామ్ సింగ్ చెప్పినట్లుగా వినాలని, ఆయన చెప్పినట్లుగా వివరాలు అందించాలని వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి తనను బెదిరించినట్లుగా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి వారి మీద కేసులు పెట్టారు. అయితే అసలు వివేకా పి కృష్ణారెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఎన్నడూ విచారించనేలేదని, సీసీటీవీ ఫుటేజీల సహా ఈ విషయం స్పష్టంగా తేలుతోందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో దాఖలు చేసిన అఫిడవిట్ల్లో పేర్కొంది. అదేవిధంగా ఈ ముగ్గురూ బెదిరించినట్లుగా వివిధ వ్యక్తుల వాంగ్మూలాలను అప్పటి విచారణ అధికారి జి.రాజు రికార్డు చేశారు. ఆయన అసలు ప్రొఫెషనల్ గా కేసును విచారించనేలేదని ప్రభుత్వం తెలిపింది.  ఏ ఒక్కరిని కూడా విచారించకుండానే, ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండానే వాంగ్మూలాలు అన్నీ ఫ్యాబ్రికేట్ చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఇందుకు రిటైర్డ్ ఏఎస్పి కె.రాజేశ్వర రెడ్డి, ఎఎస్ఐజి రామక్రిష్ణారెడ్డి లు ఎంపీ అవినాష్ రెడ్డికి సహకరించారని తెలిపింది. వారే ఇంట్లో కూర్చుని సాక్షులతో మాట్లాడినట్టుగా, వారు వాంగ్మూలాలు ఇచ్చినట్లుగా అన్ని తయారు చేశారని పేర్కొంది.  వాటిని రికార్డు చేయడానికి విచారణ అధికారి జి.రాజు నిరాకరించినప్పుడు వారు స్వయంగా అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లి చెప్పింది చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లుగా కూడా ప్రభుత్వం తెలియజేసింది.

ఎంపీ అవినాష్ రెడ్డి- వివేకా కూతురు సునీత, రాజశేఖర్ రెడ్డిలను  వివేకా హత్య వెనుక గల ప్రధాన సూత్రధారులుగా ఇరికించడానికి నానాపాట్లు పడుతున్నారనేది ప్రజలలో ఒక అభిప్రాయం. దీనికి మద్దతుగానే ఇటీవల హత్య అనే సినిమాలో కూడా అచ్చంగా సునీతను నిందితురాలుగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం జరిగింది. ఆ సినిమా గురించి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రదర్శనలను నిలుపుదల చేయించాలంటూ కోరుతున్నారు. అవినాష్ రెడ్డి ప్రయత్నాలన్నీ సునీతను ఇరికించడానికి జరుగుతుండగా ఆయన అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలియజేయడం కీలకంగా మారింది. సుప్రీం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇస్తుందో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories