తెలంగాణలోని మేధావి విశ్లేషకుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన నాగేశ్వర్‌కు.. అనలిస్టుగా చాలా పేరుంది. ఆయన టీవీ చానెళ్లలో అనలిస్టుగా పేరుప్రతిష్టలు సంపాదించి.. అక్కడినుంచి సొంత యూట్యూబ్ చానెల్ పెట్టుకుని బాగానే సంపాదిస్తున్నారు. ఆయన ప్రపంచంలో అన్ని విషయాల మీద కూడా తన విశ్లేషన చెప్పేస్తుంటారు. ఈ క్రేజ్ తో ఆయన ఓ దఫా ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. తర్వాత ఓడిపోయారు.
సాధారణంగా నాగేశ్వర్ వామపక్ష భావజాలానికి చెందిన అనలిస్టు కావడం వలన ఆయన నిత్యం భాజపాను, మోడీని ద్వేషిస్తుంటారు. చంద్రబాబును కూడా ద్వేషిస్తుంటారు. యూట్యూబులో సొంత వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. ఆయన వైఎస్సార్ కాంగ్రెసును, జగన్ ను కీర్తించడం తన వ్యాపకంగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల సీజను మొదలైన తర్వాత.. చంద్రబాబును బద్నాం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని జాకీలు వేసి లేపడానికి ప్రొ.నాగేశ్వర్ తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. జగన్ నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని చంద్రబాబు విమర్శిస్తే.. నాగేశ్వర్ దానిని కూడా ఎద్దేవా చేశారు. మొన్నమొన్నటి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. తన యూట్యూబ్ చానెల్ లో పోల్ నిర్వహించి.. జగన్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కూటమి గెలుస్తుందని చెప్పిన వారిని ఎద్దేవా చేశారు.
ఇంతా జరిగాక.. ఫలితాలు రావడం మొదలయ్యే సమయానికి ఆయన ఒక టీవీచానెల్ చర్చలో కూర్చున్నారు. హఠాత్తుగా జగన్ గూటి చిలక పాట మార్చడం ప్రారంభించింది. కూటమి గెలిచే అవకాశం ఉన్నదని చెప్పడం ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలయ్యాక కూడా ఆయన జగన్ భజనే చేశారు. అవన్నీ ఉద్యోగుల ఓట్లు వారు ఎటూ వేయరు అని సెలవిచ్చారు. తీరా రౌండ్లు మొదలయ్యాక.. నెమ్మదిగా చంద్రబాబు గెలిచే అవకాశం ఉన్నదని.. ఆ మేరకు విశ్లేషణలు వినిపించడం ప్రారంభించారు. మొత్తానికి జగన్ గూటి చిలక చంద్రబాబు అనుకూలంగా పాట పాడడం మొదలెట్టింది. ఏ రోటి కాడ ఆ పాట పాడే బాపతుగా ప్రొ.నాగేశ్వర్ గురించి ప్రజలు అనుకుంటున్నారు.