గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవిత ఇప్పుడు తన సొంత రాజకీయ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కూతురు కావడం వల్ల మాత్రమే వచ్చిన రాజకీయ అస్తిత్వాన్ని వదులుకుని తన ముద్రను సొంతంగా సృష్టించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆమె గులాబీ కండువాకు ఎప్పుడో గుడ్ బై కొట్టేశారు. పబ్లిక్ లో ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొంటే కూడా.. కేవలం తెలంగాణ జాగృతి కండువాలను ధరిస్తున్నారే తప్ప.. ఆ కండువాల్లో కనీసం గులాబీ రంగు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నారని ఆ నడుమ కొన్ని పుకార్లు ముమ్మరంగా వినిపించాయి. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. ఆమె కాంగ్రెస్ పార్టీవైపే నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని.. అయితే ‘తాను కాంగ్రెస్ వైపు మొగ్గడం తెలంగాణ జాతి అవసరం’ అని బిల్డప్పులు ఇవ్వడానికి వీలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజా పరిణామాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.
రెడ్డి నేతలను అడ్డగోలుగా తిట్టడం కారణంగా.. కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మరో భారాస తరఫున ఎమ్మెల్సీ అయినప్పటికీ.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత పై వివాదాస్పద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను ఆయన ఎంత తిట్టినప్పటికీ.. భారాస నుంచి కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. అంటే కవితను ఆ పార్టీ అప్రకటిత బహిష్కరణ విధించినట్టే అందరికీ అర్థమవుతోంది. కవిత కూడా తన తండ్రి పార్టీకి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వదలచుకున్నారు. భారాస లేకపోయినంత మాత్రాన తనకు దిగుల్లేదని.. తనకు రాజకీయ ప్రత్యామ్నాయం ఉన్నదని ఆమె చెప్పదలచుకున్నట్టు కనిపిస్తోంది. అలా ఆమె కాంగ్రెస్ నిర్ణయాన్ని కీర్తిస్తున్నారు. కేవలం కీర్తించడమే కాదు.. ఏ నిర్ణయాన్నైతే విమర్శించడం ద్వారా భారాస రాజకీయ లబ్ధి కోరుకుంటున్నదో.. దానిని కీర్తిస్తున్నారు. పైగా భారాస వాదనే తప్పు అని నిందిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో రేవంత్ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ సరైనదేనని కవిత వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. చూడబోతే.. సొంత పార్టీ ఆలోచనను ఆమె మానుకున్నట్టుగా కనిపిస్తోంది. పుష్కలంగా ధన వనరులు ఉన్నప్పటికీ కూడా.. తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు ఎదురైన అనుభవాలనుంచి కవిత పాఠం నేర్చుకున్నట్టుగా ఉంది. షర్మిల కోట్లాది నిధులు ఖర్చు పెట్టినప్పటికీ.. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర సాగించినప్పటికీ.. కనీసం ఎన్నికల్లో పోటీచేయడానికి చాలినంత ధైర్యం కూడా చిక్కబట్టుకోలేని పార్టీగా తన తండ్రి పేరిట పెట్టిన పార్టీని కాంగ్రెసులో కలిపేశారు. తనకు కూడా అలాంటి పరిస్తితి తప్పదేమోనని, డబ్బు దండగ చేసుకునే బదులు ముందే కాంగ్రెస్ కు జై కొడితే సరిపోతుందని కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ ల మీద వారి కుటుంబసభ్యురాలినే బ్రహ్మాస్త్రంగా ఎక్కుపెట్టే అవకాశం ఉంటుంది గనుక.. కాంగ్రెస్ ఆమెను ఆదరించడానికి సుముఖంగానే ఉంటుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి.