ఇప్పుడు జరిగిన పతనం కంటె కొత్తగా పతనం కాబోయేది ఏమీ లేదని, పార్టీ మళ్లీ లేచి నిలదొక్కుకునేది కూడా లేదని ఆ పార్టీలోని నాయకులందరూ నమ్ముతున్నారనడానికి, భయపడుతున్నారనడానికి ఇది మరొక ఉదాహరణ. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరు కార్యాలయాల ఎదుట ధర్నాలు, విద్యుత్తు కార్యాలయాల ఎదుట ఉద్యమాలతో పార్టీకి ఊపు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తున్న వేళ.. పార్టీ ఘాటైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉత్తరాంధ్ర కీలక నాయకుల్లో ఒకరైన అవంతి శ్రీనివాస్ తాజాగా తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జగన్ కు పంపి, మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వలన తాను.. అయిదేళ్ల పాటు తన జీవితాన్ని, కుటుంబాన్ని కోల్పోయానని, అయిదేళ్ల పాటు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా.. వైసీపీ ఓడిపోయిన తీరు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించడం విశేషం.
గత అయిదేళ్ల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా.. కార్యకర్తలు, నాయకులు ఎవ్వరికీ ప్రజల్లో విలువ లేకుండా చేశారని అవంతి అన్నారు. ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్ల మీదనే ఆధారపడి, వారి ద్వారానే సమస్త ప్రభుత్వ వ్యవహారాలు నడిపించాలని అనుకోవడం వల్ల పార్టీ నిర్మాణం మొత్తం చాలా దెబ్బతిన్నదని, కార్యకర్తలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. జగన్ తాను చెబుతున్నట్టుగా అన్నేసి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఓడించారో ముందుగా తెలుసుకోవాలని అవంతి హితవు చెప్పారు.
జగన్ జమానాలో మంత్రిగా కూడా పనిచేసిన అవంతి శ్రీనివాస్ ఆయన గురించి తీవ్రమైన విమర్శలు చేయడం విశేషం. జగన్ తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలిస్తారని, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలు అని ఆయన అన్నారు. అయిదేళ్ల కోసం ప్రజలు గెలిపించిన ప్రభుత్వానికి కనీసం ఏడాది కూడా సమయం ఇవ్వకుండా.. అప్పుడే ధర్నాలు అనడం కరెక్టు కాదని, ప్రజాస్వామ్యబద్ధం కాదని ఇలాంటి పోకడల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని అవంతి ప్రకటించారు.