ఇస్మార్ట్ శంకర్ పోతినేని రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా చెప్పుకొవచ్చు. పూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ , కానీ పూరీ కానీ ఆ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయారు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి జత కట్టా రామ్, జగన్నాథ్.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ ఇస్మార్ట్ టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు ఏపీ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది.
దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ కు ప్రతి టికెట్ పై 35 రూపాయలు పెంచుకునే విధంగా స్పెషల్ జీవో జారీ చేసింది ఏపీ సర్కార్. మొదటి 10రోజులు మాత్రమే పెంచుకునేందుకు వెసులుబాటుని ఇచ్చింది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా విడుదల కాబోతున్న మిస్టర్ బచ్చన్ అధిక రేట్లు కోసం అప్లై చేసిందో లేదో ఇక తెలియరాలేదు. ఇటు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలకే ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నో తర్జన భర్జనలు,పంచాయతీలు, నష్ట పరిహారాల చర్చల అనంతరం డబుల్ ఇస్మార్ట్ ను నైజాంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే.