నిరుద్యోగ టీచర్లకు శుభవార్త మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ టీచర్లు పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడం లేదు. ‘తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని’ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సందర్భంగా చాలా గట్టిగా హామీ ఇచ్చారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించి సీరియస్ కసరత్తు కూడా చేశారు. కానీ రకరకాల సాంకేతిక కారణాల వలన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించిన డీఎస్సీ వాయిదా పడింది. తాజాగా మంత్రి నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పర్వం ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని శుభవార్తను రాష్ట్ర ప్రజలకు అందించారు.

రాష్ట్రంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన ఉంటుంది. మార్చి మూడున ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలు వెలువడి ఆ పర్వం పూర్తయిన తర్వాత, ఎన్నికల పర్వం ముగుస్తుంది. కనుక అప్పుడు డీఎస్సి నోటిఫికేషన్ ప్రకటించనున్నట్లుగా నారా లోకేష్ వివరిస్తున్నారు.

ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం లోనూ టీచర్ల అభిప్రాయాలను పరిగణిస్తున్నామని లోకేష్ వివరించారు. గత ప్రభుత్వ పాలన కాలంలో.. జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ వర్గాలను శత్రువు లాగా ట్రీట్ చేశారనే అపప్రధ ఆ వర్గాలలో ఉంది. అలాంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ తో పాటు టీచర్లకు గౌరవం దక్కుతుండడం పట్ల వారు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు

అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ వాటాగా 800 కోట్లు ఈ బిల్లులు చెల్లించామని, జగన్ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా బకాయి పెట్టి దిగిపోయింది అని లోకేష్ వివరించారు. ఇతరత్రా రైతులకు ఉద్యోగులకు జగన్ పెట్టిన బకాయిలన్నీ తమ ప్రభుత్వం తీరుస్తున్నదని కూడా వివరించారు మొత్తానికి మార్చి నెలలో డీఎస్సీ ప్రకటన రాబోతోందనే వార్త రాష్ట్రంలో నిరుద్యోగ టీచర్లందరికి శుభవార్త అని చెప్పక తప్పదు.

Related Posts

Comments

spot_img

Recent Stories