రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన నాయకులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఆలయాలకు ధర్మకర్తల మండళ్ల నియామక పర్వాన్ని త్వరలోనే పూర్తిచేస్తాం అని ఆయన వెల్లడించారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు జరుగుతున్న సన్నాహాలను సమీక్షించేందుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి.. అక్కడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1400 ఆలయాలకు పాలకమండళ్లను నియమించడం ఇంకా పెండింగులో ఉన్నదని, త్వరలోనే ఈ పర్వం పూర్తవుతుందని అన్నారు.
కూటమి పార్టీలకు చెందిన నాయకులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. నామినేటెడ్ పదవుల భర్తీకోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. కొన్ని కీలక నామినేటెడ్ పదవులను మాత్రం చంద్రబాబునాయుడు ఇప్పటికే భర్తీ చేశారు. ఆలయ పాలకమండళ్ల విషయానికి వస్తే.. తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు నియామకం జరిగింది. రాష్ట్రంలో తతిమ్మా అనేక ప్రధాన దేవాలయాలకు కూడా పాలకమండళ్ల నియామకం జరగలేదు. బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం.. ఇలా అనేక ప్రముఖ ఆలయాలకు సంబంధించిన నామినేటెడ్ పదవులకోసం ఆధ్యాత్మిక చింతన ఉన్న, పార్టీకి బహుముఖాలుగా సేవలు అందించిన నాయకులు పలువురు ఎదురు చూస్తున్నారు.
అయితే.. కార్యకర్తల్లో.. పార్టీకోసం చిత్తశుద్ధితో సేవచేసిన వారిలో అర్హులకే పదవులు దక్కాలనే ఏకైక ఉద్దేశంతోనే.. చంద్రబాబునాయుడు కాస్త సమయం తీసుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కూటమిలోని మిగిలిన రెండు పార్టీల వారికి కూడా.. దామాషా పద్ధతిలో నామినేటెడ్ పోస్టులను పంచాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్రంలో మొత్తం 247 మార్కెట్ కమిటీలు, 1400 ఆలయాలకు సంబంధించిన పదవులు పెండింగ్ ఉన్నట్టు చంద్రబాబునాయుడు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు రామనారాయణ రెడ్డి కూడా స్పష్టత ఇస్తూ.. 1400 ఆలయాల పాలకమండళ్ల భర్తీ త్వరలో జరుగుతుందని అంటున్నారు.
ఆనం మాటలు ఆశావహుల్లో కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. ఈనెలలోనే మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. చిన్నా పెద్దా తారతమ్యాలు లేకుండా మారుమూల ఉన్నా కూడా ప్రతి శివాలయంలోను చాలా వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇలాంటి నేపథ్యంలో.. మహాశివరాత్రి పర్వదినంలోగా కనీసం శివాలయాల వరకు నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవుతుందని ఆశావహులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.