రాజధాని నగరానికి కూడా దిక్కులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయిదేళ్లపాటు కుమిలిపోయింది. మీ రాజధాని ఏదని అడిగితే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు అయిదేళ్లపాటు అవమానాలు పడ్డారు. చంద్రబాబునాయుడు కలల రాజధానిగా అమరావతికి రూపకల్పన చేస్తే.. జగన్ వచ్చి దానిని స్మశానంగా మార్చేసినప్పుడు ప్రజలు దుఃఖించారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్త. బుధవారం నుంచి అమరావతి రాజధానిలో ‘ఆపరేషన్ స్వచ్ఛ’ ప్రారంభం కానుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. పెరిగిపోయిన కర్రతుమ్మ, ముళ్లచెట్లను సమూలంగా తొలగించి.. నిర్మాణాలకు అనుకూలతను రూపుదిద్దడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.
అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటే.. చంద్రబాబునాయుడుకు కీర్తి దక్కుతుందనే అసూయతో ఆ నగరాన్ని, రైతుల త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో జగన్ అయిదేళ్ల పాటు డ్రామా నడిపించారు. అయితే జగన్ డ్రామాలను ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖను ఉద్దరించేస్తానని జగన్ పలుమార్లు ప్రగల్భాలు పలికినా.. ఆ జిల్లాలన్నీ కలిపి జగన్ కు కేవలం రెండే ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అంత దారుణంగా ఆయన పరిపాలనను, రాజధాని ముసుగులో చేసిన కుట్రలను ప్రజలు ఛీకొట్టారు. రాష్ట్రప్రజల్లో అమరావతి రాజధాని పట్ల ప్రేమ ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా వ్యక్తం అయింది. అలా అమరావతిని ప్రేమిస్తున్న రాష్ట్రప్రజలందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి.
స్మశానంలా మారిన అమరావతి ప్రాంతాన్ని మళ్లీ స్వప్నరాజధానిగా తీర్చిదిద్దడానికి పనులు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. ముళ్లచెట్లను తొలగించబోతున్నారు. నిర్మాణాలు కూడా త్వరితగతిన ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 130 కేంద్రప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో కూడా నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం అవుతాయి. భూములు పొందిన సంస్థలు రెండేళ్లలోగా తమ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. వాటితో పాటు.. రాష్ట్రప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు కూడా కొలిక్కి వచ్చేస్తాయి. గత చంద్రబాబు పాలనలోనే చాలా వరకు పూర్తయిన నిర్మాణాలు అన్నింటినీ.. ఏడాది వ్యవధిలోగా పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎటుచూసినా సరే.. మూడేళ్లలోగా అమరావతి రాజధాని నగరానికి ఒక స్పష్టమైన రూపురేఖలు ఏర్పడుతాయని పలువురు ఆశిస్తున్నారు.