ఆలోచన భళా.. హరిత సోయగాల కళ!

అమరావతిలో రాజధాని ప్రధాన భవనాల నిర్మాణాల పనులు ఎంత శరవేగంగా జరుగుతూ ఉన్నాయో.. రాజధాని నగరానికి హరిత సోయగాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా అంతే శ్రద్ధగా జరుగుతున్నాయి. అవసరమైన ప్రాంతాలలో రహదారులకు ఇరువైపులా ఒకేసారి పెద్ద పెద్ద చెట్లనే నాటించేందుకు వీలుగా జరుగుతున్న ప్రయత్నాలు శభాష్ అనిపించేలా ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తయితే గనుక.. రోడ్ల నిర్మాణం పూర్తయిన సమయానికే, ఆ రోడ్ల పక్కన నీడ నిచ్చేంత పెద్ద చెట్లు కూడా నాటడం జరుగుతుందని అర్థమవుతెంది. ఒక్కసారిగా రాజధాని నగరం హరిత సోయగాన్ని సంతరించుకుంటుందని తెలుస్తోంది. ఎలాగంటే..

రాజధాని ప్రాంతంలో తొలుత పనులు ప్రారంభించినప్పుడు.. రోడ్ల పక్కన చెట్లు నాటించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనంతవరం వద్ద ఒక పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు. వేల సంఖ్యలో అక్కడ మొక్కలు పెంచారు. కొన్ని ఏళ్లపాటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన వచ్చిన నేపథ్యంలో- అమరావతిని మొత్తం స్మశానంగా మార్చేయగా, ఆ నర్సరీ పరిస్థితి కూడా దయనీయంగా తయారయింది. నిర్వహణను గాలికి వదిలేసారు. అయినా సరే అప్పటిదాకా అక్కడ సంరక్షింపబడిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారాయి. ఇప్పుడు అమరావతికి సంబంధించి ప్రణాళికలన్నీ సిద్ధమవుతూ పనులు జరుగుతూన్న నేపథ్యంలో.. ఆ నర్సరీ ఉన్న ప్రాంతం మీదుగా ప్రధాన రహదారులు వస్తున్నాయి. ఆ చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు- ఈ చెట్లను జాగ్రత్తగా వేర్లతో సహా తవ్వించి ట్రాన్స్ లొకేట్ చేస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఉన్న సుమారు 2000 చెట్లను అనంతవరంలోనే మరొక చోటుకు ఈ రకంగా ట్రాన్స్ లోకేషన్ పద్ధతి ద్వారా మార్పించారు. అక్కడ పెద్ద పెద్ద సంచులలో వాటిని ఉంచి పెంచుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా సుమారు 2000 భారీ చెట్లను తీసుకువచ్చి ఒకే చోట వాటిని నిర్వహిస్తున్నారు. తాజాగా అభివృద్ధి చెంది చేస్తున్న నర్సరీలో సుమారు నాలుగువేల వరకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న చెట్లే కావడం గమనార్హం.
ఇప్పుడు అమరావతిలో రోడ్ల ప్రాజెక్టులు, ఉద్యానవనాల ప్రాజెక్టులు పూర్తయితే గనుక వాటి ప్రాథమిక నిర్మాణం ఒక దశకు వచ్చే సమయానికి ఆయా ప్రాంతాల్లో ఈ చెట్లను తీసుకెళ్లి నాటడం చాలా సులువుగా సాధ్యమవుతుంది. రోడ్డు ఏర్పడే సమయానికే పక్కన ఎదిగిన చెట్లు కూడా దర్శనమిస్తూ కొత్త హరిత కళను అందిస్తాయి. అమరావతి నగరంలో ఏర్పాటు అయ్యే ఉద్యానవనాలకు కొన్ని వృక్షాలు రెడీమేడ్ గా అంది వస్తాయి. ఈ నర్సరీలో పెరుగుతున్న వాటిలో రావి, మర్రి, ఉసిరి, మారేడు ఇంకా అనేక రకాల వృక్షజాతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పదేళ్ల వయసుకు ఎదిగిన పెద్దపెద్ద చెట్లను కొనాలంటే ఒక్కొక్క దానికి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది కానీ ఒకే చోట పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన నర్సరీలో పెరిగిన చెట్లను ఇప్పుడు ట్రాన్స్‌లొకేషన్ చేసి మరొక చోట కాపాడడానికి కేవలం ఆరేడువేలవంతున ఖర్చు పెడుతున్నారు. రోడ్ల డిజైన్లన్నీ ఒక రూపం సంతరించుకుంటున్నాయి కనుక ఈ ఏడాది చివరిలోగా ఇరువైపులా ఈ వృక్షాలను నాటడం కూడా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అమరావతికి హరిత సోయగాల శోభను తీసుకురావడంలో ఈ ఆధునిక సాంకేతికత కూడా ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories