జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ‘టాటా వీడుకోలు’ చెబుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వెళుతున్న వారందరూ పార్టీని మాత్రమే కాదు.. జగన్ ద్వారా తమకు సంక్రమించిన చట్టసభ పదవులను కూడా వదిలేసుకుని వెళుతుండడం విశేషం. రాజీనామాలు చేసేస్తున్నారు. తమ పదవీకాలం ఇంకా రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్లు ఉన్నప్పటికీ వారు ఖాతరు చేయడం లేదు. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా కామన్ గా కనిపిస్తోంది. పదవులను వదలి, జగన్ ను వదలి వెళుతున్న వారందరూ ఒక్కటే మాట చెబుతున్నారు. ‘పార్టీలో తమకు గౌరవం దక్కడం లేదు, విలువ దక్కడం లేదు’ అని అంటున్నారు. అందరి మాట ఒకటే అవుతుండడాన్ని బట్టి.. జగన్ తన పార్టీ నాయకులను ఎంత తీసికట్టుగా చూస్తున్నారో ప్రజలకు అర్థమవుతోంది.
తనను ఆశ్రయించి వచ్చిన వారికి ముష్టి పడేసినట్టుగా పదవులు పడేస్తే చాలు.. అక్కడితో వారు కుక్కిన పేనుల్లా, విశ్వాసంతో తోకఊపుకుంటూ పడి ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటారేమో తెలియదు. ఇప్పుడు అందరూ గుడ్ బై కొడుతూ ఉంటే గానీ.. ఆయన నాయకుల్ని ఎంత హీనంగా చూశారో పూర్తిగా అర్థమవుతోంది.
జగన్మోహన్ రెడ్డి బుద్ధిలోనే మనుషుల్ని చులకనగా చూడడం అనేది ఉన్నదేమో అనిపిస్తోంది. ప్రజలను కూడా ఆయన ముష్టివాళ్లుగానే చూశారేమో అని, నాయకుల మాటలను కూడా పోల్చుకుంటూ ఉంటే అనిపిస్తోంది. ప్రజలందరికీ తలాకొంచెం డబ్బు పడేస్తే.. వాళ్లు తనకు రుణపడి.. తనను దేవుడిగా భావిస్తూ.. తన పట్ల భక్తిభావంతో ఉండాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోకుండా.. ప్రజలకు డబ్బు పంచడం ఒక్కటే చేస్తూ వచ్చారు. అలా అందరికీ తలాకొంత విదిలించడమే తనకు ఓటు బ్యాంకు అవుతుందని, తాను వేసే ముష్టి వారిలో ప్రేమ పుట్టిస్తుందని ఆయన అనుకున్నారు.
నాయకులను కూడా అలాగే డీల్ చేశారేమో అనిపిస్తోంది. నాయకులకు పదవులు ముష్టి పడేస్తే.. ఇక పడి ఉంటారని అనుకున్నారు. కానీ, వారికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని, ప్రజాసేవలో తమకు ఒక స్థాయి, ఒక విలువ ఉండాలని కోరుకుంటారని ఆయన గుర్తించలేదు. దాని ఫలితమే ఇప్పుడు ఇలా నాయకులు వరుసకట్టి గుడ్ బై చెబుతుండడం అని ప్రజలు భావిస్తున్నారు.