మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా డిస్టిలరీల నుంచి ముడుపుల రూపంలో కాజేసిన పాపంలో భాగస్వాములైనందుకు వారందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. నేరం పూర్తిస్థాయిలో నిరూపణ అయిన తర్వాత, వారికి పూర్తిస్థాయి శిక్షలు పడతాయి. ఈలోగా పదేపదే బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంటూ భంగపడుతూ రోజులు నెట్టుకొస్తున్నారు. రిమాండ్ పూర్తయిన ప్రతిసారి కోర్టుకు హాజరు కావడం న్యాయమూర్తి వారికి రిమాండ్ ను పొడిగించడం జరుగుతూ వస్తోంది. అయితే కోర్టుకు హాజరైన సందర్భాలలో న్యాయమూర్తిని వారు కోరుతున్న కోరికలు మాత్రం బీభత్సంగా ఉంటున్నాయి. తమకు నచ్చిన చోట చికిత్సలు అనుమతించాలని, తమ వ్యక్తిగత ముచ్చట్లకు అవకాశాలు కావాలని వారు కోర్టును అడగడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.
లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితులు అందరికీ వచ్చే నెల 9వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. వీరి రిమాండ్ పూర్తయిన సందర్భంగా రాజమహేంద్రవరం జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, విజయవాడ జైలు నుంచి రాజ్ కసిరెడ్డి, బూనేటి చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ అందరిని ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచారు, వారికందరికీ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు రిమాండ్ పొడిగించడంతో తిరిగి వారి వారి జైళ్లకు తరలించారు. ఈ మధ్యలో న్యాయమూర్తి ఎదుట పెట్టిన వారి కోరికలే చిత్రమైనవి .
తనకు వెన్నునొప్పి ఉన్నదని, తిరుపతిలో ఉన్నప్పుడు స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేయించుకునే వాడినని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకున్నారు. 70 రోజుల నుంచి జైలులో ఉన్నానని వెన్నునొప్పి తీవ్రమవుతోందని చికిత్సకు అనుమతించాలని ఆయన కోరారు. గతంలో ఆయన వెన్నునొప్పి కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పుడు.. అక్కడ ఫిజియోథెరపీ తీసుకునేందుకు చెవిరెడ్డి తిరస్కరించినట్లుగా పోలీసుల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే చెవిరెడ్డి మాత్రం తన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉండవిల్లిలోని ప్రకృతి చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరడమే తమాషా. ఆయన కోరినచోట చికిత్స అనే ముసుగులో బెయిలు కోసం దరఖాస్తు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది.
మరోవైపు మిథున్ రెడ్డి కోరిక ఇంకా చిత్రంగా ఉంది. తాను ఎంపీ కనుక జైలు నిబంధనలేవీ తనకు వర్తించవు అని ఆయన భావిస్తున్నారేమో తెలియదు. ఎందుకంటే విజయవాడ నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లే సమయంలో.. ఎస్కార్ట్ సిబ్బంది ఫోన్ నుంచి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు అనుమతించాలంటూ మిథున్ రెడ్డి న్యాయవాది ద్వారా కోర్టును అభ్యర్థించారు. అయితే ఇలాంటి ప్రత్యేకమైన వెసులుబాటును కల్పించడానికి కోర్టు తిరస్కరించింది.
వీరిద్దరి వంతు ఇలా ఉండగా మద్యం కేసులో నిందితులు గోవిందప్ప బాలాజీ, వెంకటేష్ నాయుడు కృష్ణమోహన్ మరోసారి మంగళవారం బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. వీరంతా అలుపెరుగని మడమతిప్పని పోరాటాలను బెయిల్ కోసం సాగిస్తున్నారు.