జగన్ నెగ్గితే దేవుడు కన్నీళ్లు పెడతాడట!

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ఏ సభ నిర్వహించినా తన ప్రత్యర్థులను తిట్టిపోసే ప్రయత్నంలో భాగంగా నాటకీయమైన కొన్ని డైలాగులను ప్రతిసారీ చెబుతుంటారు. రాష్ట్రంలో పేదలకు, ధనవందులకు మధ్య క్లాస్ వార్ జరుగుతోందని ప్రకటించే జగన్మోహన్ రెడ్డి- ‘‘వారికి డబ్బులున్నాయి, వారి వెనుక యెల్లో మీడియా ఉంది, వారికి వ్యాపారాలున్నాయి.. కానీ, నా వెనుక అవేమీ లేవు. నాకు ఉన్నదెల్లా మీరు మాత్రమే.. మీతో పాటు దేవుడి ఆశీర్వాదం మాత్రమే’’ అని చాలా రాగయుక్తంగా జగన్ చెబుతుంటారు. ఏ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని జగన్ అనుకుంటూ ఉన్నారో గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిస్తే మాత్రం.. హిందూ దేవుళ్లందరూ కన్నీళ్లు పెట్టుకుంటారట. హిందూ వ్యతిరేకి అయిన జగన్ అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో హిందూ ధర్మం యాభయ్యేళ్లు వెనక్కు వెళ్లిపోయిందట. తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని హిందూ ఆలయాల్లోనూ క్రైస్తవ ఉద్యోగులను చొప్పించి.. అక్కడి పవిత్రతను, ధర్మాచరణను మంటగలిపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారట. ఈ విషయాలన్నీ ఏదో దారినపోయే తెలుగుదేశం కార్యకర్తనో, జనసేన నాయకుడో అక్కసుతో చేసిన వ్యాఖ్యలు కానే కాదు. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుులు శ్రీనివాసానంద సరస్వతి ఒక టీవీఛానెల్ తో చెప్పిన మాటలు. ఏపీలో హిందూ ధర్మానికి పట్టిన దుర్గతి గురించి పొరుగురాష్ట్రాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన అంటున్నారు.


రామతీర్థం రాముడి విగ్రహాన్ని చోరీ చేసిన వారిని పట్టుకోలేని వైఫల్యం దగ్గరినుంచి, బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు మాయమైన వైనం, సింహాచంల భూములు కాజేయడానికి అశోక్ గజపతి రాజును తప్పించిన తీరు లను ఆయన తప్పుపట్టారు.

జగన్ కు  మద్దతు పలుకుతున్న కొందరు స్వాములు శుక్రాచార్యుల వంటి వారంటూ, ఏం ఉద్ధరించారిన పీఠానికి తీసుకువచ్చి యజ్ఞాలు, హోమాలు చేయిస్తున్నారంటూ, పరోక్షంగా విశాఖ స్వరూపానంద తీరుతెన్నులను  శ్రీనివాసానంద నిలదీయడం విశేషం. జగన్ ను ఓడించడానికి రాష్ట్రంలోని ప్రతి హిందువూ పూనుకోవాలని పిలుపు ఇచ్చారు.

రాజకీయ నాయకులు పొలిటికల్ కామెంట్లు చేయడం అనేది మనదేశంలో చాలా చాలా కామన్ వ్యవహారం. అయితే ఈ స్థాయిలో ఒక నాయకుడు మళ్లీ గెలిచినట్లయితే.. దేవుళ్లే కన్నీళ్లు పెట్టుకుంటారని అనడం.. అంత ఘోరంగా హిందూ ధర్మానికి ద్రోహం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేయడం మాత్రం ఇదే ప్రథమం.


హిందూ ఆలయాల విషయంలో జగన్ ప్రవర్తనపై గతంలోనూ ఎన్నో విమర్శలు వచ్చాయి. తిరుమలలో అన్యమతస్తులు ఇవ్వాల్సిన డిక్లరేషన్ ను ఎన్నడూ ఇవ్వకుండా ఆయన దబాయించుకుంటూ వెళ్లేవారు. అలాగని హిందువుగా మారినట్లు చెప్పుకోవడానికి కూడా లేదు. తిరుమల కాదు కదా.. ఏ ఆలయంలోనూ ఆయన ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కార్యక్రమాలు చేసినప్పుడు.. భార్యతో కలిపి వెళ్లనూ లేదు. ఈ విమర్శలు ఏవీ ఖాతరు చేయకుండా.. ఆయన తన వ్యవహార సరళి మార్చుకోకుండా ముందుకెళుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories