వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియా సింహాల్లో, ట్విటర్ పులుల్లో విజయసాయిరెడ్డి అగ్రగణ్యులు. ప్రజల్లో కించిత్తు సొంత ఆదరణ కూడా లేని ఆ నాయకుడు.. ట్విటర్ లో మాత్రం మహా దూకుడైన పోస్టులతో చెలరేగిపోతుంటారు. ఆయన చేసిన తాజా పోస్టు ఒకటి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆయన అజ్ఞానానికి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలాంటి అజ్ఞానంతో వర్ధిల్లుతున్న నాయకుల మీద ఇంకా ఘోరంగా ఆధారపడుతున్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత మరింత పతనం దిశగా వెళుతున్నారని ప్రజలు అంటున్నారు.
ఇంతకూ విజయసాయిరెడ్డి ఏం ట్వీట్ చేశారో తెలుసా?
‘‘విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి! ఆంధ్రరాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ.’’ ఇదీ ఆయన ట్వీట్. ఇందులో ఆయన అజ్ఞానం మాత్రమే కాదు, అర్థం పర్థం లేని అక్కసు కూడా బయటపడుతున్నదని అంటున్నారు.
ఇళ్లు మునగడం గురించి చంద్రబాబునాయుడు ఆయన చెప్పినట్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయనేలేదు. బుడమేరు కారణంగా విపత్తు వాటిల్లడానికి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, కుట్ర ఎంత ఉన్నదో మాత్రమే ఆయన చెప్పారు. ఆ సంగతి విజయసాయికి వినిపించలేదు. అలాగే విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు ఆయన. కేంద్రమంత్రి విశాఖ ఉక్కును సందర్శించి.. ప్రెవేటీకరణ ఉండదని చెప్పి వెళ్లారు. అయితే చాపకింద నీరులా అది జరుగుతున్నదని వ్యాఖ్యానిస్తూ అందుకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్నారు. అదే నిజమైతే, రాజ్యసభ ఎంపీగా ఆయన ఏం చేస్తున్నారు? అయిదేళ్లు పాలన సాగించిన ఆయన పార్టీ ఏం చేస్తోంది? ఏం చేసింది? అనేది ప్రజల సందేహం.
నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు స్వీయ ప్రకటన చేసుకుంటున్నారట. ప్రజా నాయకుడిగా గెలిచిన చరిత్ర ఇప్పటిదాకా లేని ఆయనకు ఎద్దేవా చేసే హక్కుంటుందా? విజయసాయి అజ్ఞానంలో ఉన్నంత మాత్రాన.. చంద్రబాబు మొదటి సారి ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారో రికార్డులు చెప్పకుండా ఉంటాయా అనేది ప్రజల సందేహం. ఆయన వరుస విజయాల మతలబు ప్రజలు తెలుసుకోవాలట. ముందు వీరి ఓటమి కారణం విజయసాయి వంటివారే అనే సంగతి వీరి నాయకుడు తెలుసుకుంటే చాలు.
అన్నింటినీ మించి.. ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కాపాడాలని విజయసాయి అంటున్నారు. భగవంతుడు పూనుకుని కాపాడబట్టే కదా.. జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాడు అని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దేవుడు కాపాడాలన్న విజయసాయి మాటలు బ్యాక్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తున్నాయి.