వైసీపీకి గొయ్యి తవ్వేస్తున్న నెయ్యి వివాదం!

తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారుచేసేందుకు వాడే నెయ్యిలో కల్తీ ఉన్నదనే విషయం రెండు రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అయితే కేవలం కల్తీ మాత్రమే కాదు.. వెజిటబుల్స్, పంది కొవ్వు కలిపి మరీ ఆ నెయ్యిని తయారుచేశారనేది తాజాగా నిపుణులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఇతర అవసరాలకు కొనే నెయ్యి ధర, లడ్డూ తయారీకోసం కొనే నెయ్యి ధర మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా కల్తీ నిజమని నమ్మేలా ఉంటున్నాయి. మొత్తానికి నెయ్యి రగడ కాస్తా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గొయ్యి తవ్వేసేలా కనిపిస్తోంది.

తిరుమల లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యిని ఎన్డీడీబీ కాఫ్ సంస్థ వారు పరీక్షించి అందులో కల్తీని నిగ్గు తేల్చారు. జగన్మోహన్ రెడ్డి పాలన సాగిన అయిదేళ్లలో లడ్డూ ప్రసాదం నాణ్యతపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. నాణ్యత దిగజారిపోయిందని.. కనీసం లడ్డూ ప్రసాదం వాసన కూడా పాతరోజుల్లోలాగా ఉండడం లేదని అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. సహజంగానే.. వైసీపీ హయాంలో టీటీడీ పరిపాలన చూస్తున్న బధిరాంధులైన పెద్దలు ఆ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా తమంత తాము చెలరేగిపోయారు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత.. పాత ప్రభుత్వ  హయాంలో వాడిన నెయ్యిని పరీక్షలకు పంపారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రెండురోజులుగా రాష్ట్రంలో అట్టుడికిపోతోంది. ప్రజలు వైసీపీ జమానాను ఈసడించుకుంటున్నారు. దేవుడి ప్రసాదంలో దోచుకోవడం ఒక ఎత్తు, పంది కొవ్వు కలుపుతూ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతారా అంటూ నిందిస్తున్నారు. కల్తీని ఈవో శ్యామలరావు కూడా ధ్రువీకరించగా, ఈ విషయంలో సమగ్ర నివేదిక ఇవ్వవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఒకవైపు పవన్ కల్యాణ్ కూడా.. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసే ధైర్యం వారిదని ఎద్దేవా చేశారు. మరోవైపు జగన్ మాత్రం వంద రోజుల పాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, నెయ్యి వివాదం తెరపైకి తెచ్చారని అంటున్నారు.

ఎటు చూసినా కూడా.. దేవదేవుడికి చేసిన ఈ ద్రోహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం లిఖించేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెయ్యి దందా వైసీపీకి గొయ్యి తీసి పాతిపెడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories