ఎట్టకేలకు సజ్జల రామక్రిష్ణారెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు. ఏ పోలీసు యంత్రాంగాన్నయితే తన చెప్పుకింద చీమల్లాగా అయిదేళ్లు పాటూ ఆడిస్తూ వచ్చారో అదే పోలీసువ్యవస్థ ఎదుట ఆయన విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. కొమ్ములు తిరిగిన పోలీసు ఉన్నతాధికారులు తన ఆఫీసు బయట గంటల కొద్దీ..వేచి ఉండే పరిస్థితులను ఆయన అయిదేళ్లపాటు అనుభవించారు. ఇప్పుడు ఆయన పోలీసు స్టేషను బయట పచార్లు చేస్తూ వేచి ఉండి తర్వాత లోనికి వెళ్లే రోజులను కూడా చూశారు. అయితే పోలీసు విచారణలో సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆద్యంతమూ విచారణకు సహకరించకుండా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమూ, పోలీసుల మీదనే కోప్పడం జరిగింది. నేరంలో తనకు పాత్ర లేదని చెప్పుకోవడానికి కోపం ఒక మార్గం కాదనే సంగతి సజ్జల ఎప్పుడు తెలుసుకుంటారో గానీ.. ఆయన ప్రదర్శించిన ఆగ్రహం మొత్తం ఆయన మీద అనుమానాలు పెరగడానికే దారితీసేలా ఉంది.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మూకలు, గూండాలు దాడికి దిగి, విధ్వంసం సృష్టించిన కేసు ఇప్పుడిప్పుడే విచారణ పూర్తయ్యే దశకు చేరుకుంటోంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆ ఉత్తర్వులు ఇంకా తమకు అందకపోవడం వలన మంగళగిరి పోలీసులు నిందితులను వరుసగా విచారిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే.. దాడికి కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జలను కూడా విచారణకు పిలిచారు. ఆయనమీద జారీ అయిఉన్న లుక్ అవుట్ నోటీసుల కారణంగానే.. విదేశాల్లో ఉన్న ఆయన తిరిగి వచ్చిన సంగతి తెలుసుకున్న పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ హైడ్రామా తరువాత సజ్జల పోలీసు విచారణకు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి సహా హాజరయ్యారు. న్యాయవాదిని పోలీసులు అనుమతించకపోవడం కాస్త వివాదంగా మారింది. చివరికి సజ్జల ఒక్కరే పోలీసు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
సజ్జల ఎంతసేపూ తాను దాడి జరిగిన రోజున బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో ఉన్నానని, కాబట్టి తనకు సంబంధం లేదని మాత్రమే అంటున్నారు. వాస్తవంలో ఆయన టీడీపీ ఆఫీసుపైకి ఎగబడి అక్కడ విధ్వంసం చేశారని కేసులో కూడా లేదు. ఆయన సూత్రధారిగా.. అందరినీ రెచ్చగొట్టి దాడికి పురిగొల్పి పంపారనేది మాత్రమే ఆరోపణ. ఆ పని చేయడానికి బద్వేలులో ఉన్నా, అమెరికాలోఉన్నా కూడా అడ్డులేదనే లాజిక్ సజ్జల మిస్సవుతున్నారు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వ్యక్తి ఆరోజంతా పదేపదే కేసులో ఉన్న ఇతర పార్టీ నాయకులతో ఏం మాట్లాడారని ప్రశ్నిస్తే మాత్రం సజ్జల బ్యాలెన్స్ కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడితే తప్పేంటి.. మాట్లాడకూడదా అంటూ దర్యాప్తు అధికారిమీదనే విరుచుకుపడుతున్నారు. ఫోను ఇవ్వడానికి మాత్రం సజ్జల కూడా ఒప్పుకోవడం లేదు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛ అని ఒకవైపు అంటూనే.. మరోవైపు ఆ ఘటన తర్వాత నాలుగు ఫోన్లు మార్చానని అప్పుడు వాడిన ఫోను ఎవరికిచ్చానో కూడా గుర్తులేదని చెప్పడం విశేషం. పట్టాభి మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి.. నాకే రక్తం మరిగింది.. పట్టాభిని తన్నాలనిపించింది.. అంటూ సజ్జల తన పాత ఆవేశాన్ని కూడా పోలీసు విచాకరణలో బయటపెట్టుకుంటున్నారు.
విచారణ తరువాత.. బయటకు వచ్చి అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ సజ్జల సన్నాయి నొక్కులు నొక్కి ఉండవచ్చు గానీ.. ఆయన ఆవేశపూరితమైన సమాధానాల వల్ల మరింతగా కేసులో కూరుకుపోతున్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు.