గీతక్క పుణ్యం: వైసీపీ ఓట్లబేరాలు బట్టబయలు!

‘వంగా గీతను గెలిపించండి.. డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తా’ అని తన నియోజకవర్గం ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో అనేసరికి.. ఆమెకు ఆశ పుట్టినట్టుగా ఉంది. గెలిస్తే చాలు.. అప్పనంగా డిప్యూటీ పదవి దక్కుతుందనే ఆశతో, ఆమె సాహసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారనే అంచనాలు బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఓటర్లకు డబ్బు పంచే సాహసం చేశారు. అయితే కొందరికి మాత్రం ఓట్లకు డబ్బులు పంచి, నియోజకవర్గంలో మరికొందరికి పంచకపోవడంతో మొత్తం బండారం బట్టబయలు అయింది.

తమ ఓట్లకు డబ్బు అందని ప్రజలంతా.. ఒక్కుమ్మడిగా పిఠాపురంలోని వంగాగీత కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరికి డబ్బులిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనలకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ముట్టడితో దిక్కుతోచని వైసీపీ నేతల ఫిర్యాదు మీద అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ జనాలు అందరినీ చెదరగొట్టి పంపేశారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా జనాలకు డబ్బులిచ్చి ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని నోట్ల పంపిణీ దందాలు మొదలెడితే.. అది కాస్త జనం నుంచి డిమాండుగా మారి కార్యాలయం మీదికి దండుగా వచ్చేసరికి వంగా గీత పరువు పోయినట్లయింది.

పిఠాపురంలో తనను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోందని పవన్ కల్యాణ్ ముందే చెప్పారు. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా.. పవన్ కల్యాణ్ ను ఓడించడాన్ని అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఓడించాలని డబ్బు పంపిణీకి తెరలేపింది. అయితే పిఠాపురం ఒక్కచోట మాత్రమే కాదని.. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా కూడా డబ్బు పంపిణీ ద్వారా మాత్రమే గెలవాలని అనుకుంటున్నదని వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మరి వారు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయండి.. అంటూ పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు. ప్రజలు కూడా అలాగే చేయబోతున్నారా? లేదా? అనేది వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories