ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న అతి కొద్దిమంది ఎన్నదగిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో గరికపాటి నరసింహారావు కూడా ఒకరు. సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు.. పురాణకథలు, ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చెబుతుంటారు. కానీ.. గరికపాటి వారి రూటే సెపరేటు! ఆధ్యాత్మిక విషయాలతో లౌకిక విషయాలను కూడా మేళవించి చెబుతుంటారు. జీవన శైలులను మెరుగుపరచుకునే విషయాలు కూడా చెబుతుంటారు. అలాంటి గరికపాటి తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారం మీద సటైర్లు వేయడం విశేషం.
గుంటూరులోని పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి 55 వసంతాల వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్పీకరు అయ్యన్నపాత్రుడు తో పాటు, అతిథిగా గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. వక్తలు సహజంగా ఎన్టీఆర్ గొప్పదనం గురించి కొనియాడారు. గరికపాటి మాట్లాడుతూ.. దేశభక్తి, దైవభక్తి రెండూ ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శాసన సభకు రాను అని చెప్పకుండా.. సభకు వెళ్లి ప్రజల సమస్యలు చర్చించిన రాజకీయ దురంధరుడు అని ప్రశంసించారు.
ప్రస్తుత శాసన సభలో కేవలం 11 సీట్లు గెలిచిన పార్టీ నాయకుడిగా అవమానం ఫీలవుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎగ్గొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన పేరు ప్రస్తావించకుండా గరికపాటి ఈ సెటైర్ లు వేశారు.
అలాగే ఎన్టీఆర్ తను ప్రారంభించిన ప్రతి పథకానికి తెలుగు అనే పదం జోడించారు తప్ప.. తన పేరు, తన పార్టీ వారి పేరు పెట్టుకోలేదని గుర్తు చేసారు. గరికపాటి వారి ఈ వ్యాఖ్య.. అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరికీ చురక అంటించేదే కావడం విశేషం.