దెయ్యాలు వల్లించే వేదాల్లాగా గడికోట పలుకులు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి వందల కోట్ల రూపాయల దందాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సస్పెండ్ అయితే.. యావత్తు ఉద్యోగులందరినీ చంద్రబాబునాయుడు వేధిస్తున్నట్టుగా బురద చల్లడానికి ఆయన సాహసిస్తున్నారు. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తున్నదని అంటున్నారు. తన మీడియా ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వ హననం చేయిస్తున్నారంటూ పాపం.. ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

గడికోట శ్రీకాంత్ రెడ్డి మాటలు ప్రజలకు మాత్రం కామెడీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. శాడిస్టు ప్రభుత్వం నడుస్తున్నదనే ఆరోపణలను జగన్ సర్కారు అయిదేళ్లపాటు ఎదుర్కొంది. రాష్ట్ర అధితనేతలో అసలైన శాడిజం అంటే ఏమిటో జగన్ రుచిచూపించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను కూడా మూయించేసి తన శాడిజం ప్రదర్శించారు. ఎంతటి విధ్వంస పాలన అందించారో అందరికీ తెలుసు. పైగా తన సొంత మీడియాతో రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేయించే దుర్మార్గపు తప్పుడు కథనాలు ప్రచురించి చెలరేగినది ఎవరో కూడా ప్రజలకు తెలుసు. అలాంటిది అవే ఆరోపణలను గడికోట చంద్రబాబు మీద పులుముతుండడం విశేషం.

ఒక అధికారిని మందలించినందుకు, వైసీపీ దళాలకు ఆత్మీయుడైన ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసినందుకు ఉద్యోగులందరినీ చంద్రబాబు వేధిస్తున్నట్టుగా గడికోట అభివర్ణిస్తున్నారు. ఒకరిద్దరు తప్పుడు వ్యక్తులకోసం ఆయన ఇంతలా వెనకేసుకు రావడం చిత్రంగా ఉంది. అంతకంటె కామెడీ మాటలేంటంటే.. జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత మేలు చేశారట. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికూడా జగన్ పాలనను ఏ రకంగా అసహ్యించుకున్నారో అందరికీ తెలుసు. ఉద్యోగ వర్గాలను విపరీతంగా వేధిస్తూ మూటగట్టుకున్న చెడ్డపేరు కారణంగానే.. అసలు జగన్ ఓడిపోయారనే వాదన కూడా ఉంది. అలాంటిది గడికోట రివర్సులో చెబుతున్నారు.

రెడ్లకు కీలక పదవులు దక్కకపోయేసరికి గడికోట ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుంది. ఒక సామాజిక వర్గాన్ని డీఎస్పీ పోస్టుల్లో పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రాజ్యం చేసినప్పడు.. ఆ వర్గానికే అన్ని పదవులూ కట్టబెట్టారనే సంగతిని ఆయన మర్చిపోతున్నారు. అందుకే గడికోట పలుకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories