నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ఎన్నికల బరిలో దిగడం వరకు పక్కా.. ఏ పార్టీ తరఫున, ఏ నియోజకవర్గం నుంచి, ఎంపీగానా ఎమ్మెల్యేగానా అనేది మాత్రం ఇంకా తేలలేదు.. అని రఘురామ చెబుతున్నారు. ఆయన ఇంకా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ.. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేయబోతున్నట్టుగా వినిపిస్తోంది. ఉండి- ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం ఎంపీ పరిధిలోనిదే కావడం గమనార్హం.
రఘురామక్రిష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజీనామాచేసిన తర్వాత.. తన సిటింగ్ సీటు నరసాపురం నుంచే ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఎన్డీయే కూటమిలో ఏ పార్టీకి ఆ సీటు దక్కితే వారి తరఫున పోటీచేయాలని అనుకున్నారు. ఆ సీటును భాజపా దక్కించుకున్నది గానీ.. టికెట్ మాత్రం ఆయనకు రాలేదు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న రఘురామ తన చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్నదంటూ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఒకవైపు చంద్రబాబునాయుడు కూడా అభ్యర్తుల ఎంపికను పూర్తిచేసేయగా, ఏదైనా ఒక సీటునుంచి ప్రకటించిన వారిని తప్పించి.. రఘురామకు టికెట్ ఇవ్వవచ్చుననే ప్రచారం జరిగింది.
ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, తెలుగుదేశం పార్టీకి సిటింగ్ స్థానం అయిన ఉండి నుంచి ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిని తప్పించి రఘురామకు కేటాయించవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఉండిలో 2019లో తెలుగుదేశం తరఫున మంతెన రామరాజు పోటీచేసి గెలిచారు. జగన్ హవాను తట్టుకుని పది వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు మళ్లీ ఆయననే బరిలో తెలుగుదేశం మోహరించింది. వైసీపీ తరఫున పాతప్రత్యర్థి పీవీఎల్ నరసింహరాజుతోనే ఆయన తలపడుతున్నారు. అయితే ఆయనను పక్కకు తప్పించి ఉండి నియోజకవర్గం నుంచి రఘురామక్రిష్ణ రాజును బరిలో దించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ప్రకటన రావొచ్చు.
అయితే.. ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం అవుతున్న రఘురామక్రిష్ణ రాజు.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత తనకు కావాల్సిన స్థానం ఏమిటో ఇప్పుడే కోరికను బయటపెడుతున్నారు.
చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకరుగా చూడాలని అనుకుంటున్నారని ఆయన తన కోరికను బయటపెట్టారు. అంటే ఆయన తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచాక, తనకు మంత్రి పదవి అక్కర్లేదుగానీ.. అసెంబ్లీ స్పీకరు పదవి ఇవ్వండి అని ముందే సంకేతాలు పంపుతున్నట్లుంది.