జగన్ గొడ్డలివేటు నుంచి..  చిగురిస్తున్న ఆశలు!

‘ఒక్క ఛాన్స్’ అంటూ ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా భ్రష్టు పట్టించారో అందరికీ తెలుసు. తనకు ఒక్క అవకాశం దక్కగానే రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ఆయన ఎంతగా సర్వనాశనం చేశారో కూడా ప్రజలు గమనించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఒక్క గొడ్డలి వేటుతో ఆయన మొత్తం పారిశ్రామిక విస్తరణ ఆశలను సమూలంగా నరికేశారు. అలాంటిది జగన్ నరికేయగా మిగిలిన మోడు, ఇప్పుడు మళ్లీ కొత్త చిగుర్లు తొడిగేలాగా చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి తన ముద్రగల ప్రయత్నాలను ప్రారంభించారు.

జగన్ హయాంలో ఒత్తిడిలను తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలను తిరిగి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఐదు పారిశ్రామిక పాలసీలు తయారు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను నిర్దేశించారు. గతంలో రాష్ట్రంలో అప్పటికే ఒప్పందాలు కుదుర్చుకొని పారిశ్రామిక యూనిట్లు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్న వారిని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు. వారికి వాటాలు దక్కాలని కమిషన్లు దక్కాలని ఒత్తిడి చేస్తూ మొత్తానికి అసలు యూనిట్లు ఏపీలో ప్రారంభించాలని అంటేనే భయపడి పారిపోయే పరిస్థితిని కల్పించారు. ఎంతో కాలం నుంచి ఏపీలో ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కూడా జగన్ ప్రభుత్వపు దెబ్బకు జడిసి పారిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో కియా మోటార్స్ కూడా ఏపీ నుంచి వెళ్లిపోవాలని ఆలోచన చేసిన మాట నిజం. అమరరాజా తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయదలుచుకున్న యూనిట్ ను అక్కడి నుంచి తరలించి తెలంగాణలో పెట్టుకున్నది. హీరో హోండా మోటార్స్ అసలు ఏపీకి రాకుండానే తరలిపోయింది. అలాంటి అనేక సంస్థలు ఏపీ వైపు చూడాలంటేనే భయపడ్డాయి జగన్ పాలనకు జడుసుకున్నాయి.

ఆ దుర్మార్గమైన పారిశ్రామిక వాతావరణం నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు నడుంబిగించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వారు కోరే అన్ని రకాల రాయితీలు ఇస్తామంటూ ఇప్పుడు ఆఫర్లు పెడుతున్నారు. గతంలో వెళ్లిపోయిన వారు కూడా తిరిగి రావాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపాలని అవసరమైతే తాను కూడా మాట్లాడతానని పరిశ్రమల మంత్రి, అధికారులతో చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. పరిశ్రమల రాక ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల జోరు పెరుగుతుందని వేల లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని అంచనాలు సాగుతున్నాయి.
ఇప్పటికే కేంద్రం తమ బడ్జెట్ లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పురోగతికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఆ పరిస్థితులను మరింతగా సద్వినియోగం చేసుకుని పరిశ్రమలను తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories