శాసనసభ జరుగుతోంది. ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతోంది.. చర్చలు సాగుతున్నాయి. బిల్లులు చట్టాల రూపం దాలుస్తున్నాయి. వ్యవహారాలు సజావుగా నడుస్తున్నాయి. ఇవి చూచి ఓర్వలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్లడానికి కూడా మొహం చెల్లక.. సాకులు చెప్పి తప్పించుకున్నారు. సభ వెలుపల ఉండి పోరాటం చేస్తామని జగన్ అన్నారు గానీ.. ఇప్పటిదాకా ఆయన ఏం పోరాటాలు చేశారో లెక్క తెలియదు. అయితే పాత ప్రభుత్వం చేసిన అప్పులు పెట్టిన ఖర్చులు, వచ్చిన వ్యత్యాసం, ఆ ముసుగులో స్వాహా చేసిన వైనం గురించి సభలో నాయకులు మాట్లాడినప్పుడు మాత్రం వారికి కంగారు పుడుతోంది. అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.
సభకు వెళ్లకుండా బయటినుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తానని అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కంటె తాను ఇంకా గొప్పవాడినని నిరూపించుకునేలా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అడుగుపెట్టకుండా హైదరాబాదునుంచి ఏపీ వ్యవహారాల మీద తన స్పందనలను సంజాయిషీలను తెలియజేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వం తెచ్చిన అన్ని పథకాలనూ స్కాముల కోసమే తెచ్చిందని కూటమి నాయకులు మాట్లాడుతున్నారని.. అన్ని పథకాల లబ్ధి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయినప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో బుగ్గన శాఖలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా సరే.. హైదరాబాదు ప్రెస్ క్లబ్ కు వచ్చి బుగ్గన ప్రెస్ మీట్ పెట్టేస్తారు. జగన్ సర్కారు 9.5 లక్షలకు పైగా అప్పులు తెచ్చిందని అందరూ అంటున్నారు. మరి 2.74 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా తాను ప్రజలకు పంచిపెట్టినట్టు జగన్ ఊదరగొట్టుకుంటున్నారు. మధ్యలో అయిదున్నర లక్షల కోట్ల రూపాయలకుపైగా వ్యత్యాసం వచ్చిన సొమ్ము ఎక్కడికెళ్లిందో పాతప్రభుత్వపు ఆర్థిక మంత్రి కనీసం హైదరాబాదు ప్రెస్ క్లబ్ నుంచి అయినా స్పష్టత ఇవ్వాలి. లక్ష కోట్ల రూపాయలు అవసరం గనుక.. యాభైవేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను చిన్నచూపు చూస్తూ అమరావతి రాజధాని వద్దని అన్న జగన్.. అయిదున్నర లక్షల కోట్ల రూపాయల నిధులతో అయిదేళ్లలో రాష్ట్రంలో ఏం సాధించారో కనీసం బుగ్గన చెప్పగలరా? అనేది ప్రజల ప్రశ్నగా ఉంది.