ధర్మారెడ్డి నుంచి టీటీడీకి విముక్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు నాలుగోసారి పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు.. అదే రోజున సాయంత్రం తిరుమలకు వచ్చి, వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఎవరి కబంధహస్తాలలో చిక్కుకుని.. దేవదేవుడు అయిదేళ్లుగా విలవిల్లాడుతున్నాడో.. ఆ ధర్మారెడ్డినుంచి స్వామివారికి విముక్తి కల్పించనున్నారు. తాను ముఖ్యమంత్రిగా  తిరుమలలో అడుగుపెట్టే సమయానికి, కనీసం ప్రోటోకాల్ బాధ్యతలకోసం అయినా తనను స్వాగతించడానికి ఈవో ధర్మారెడ్డి హాజరు కావడానికి వీల్లేదని, ఆయన మొహం చూడనని, ముందే ఆయనను సెలవుపై పంపేయాలని చంద్రబాబునాయుడు అధికారుల్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

అత్యంత వివాదాస్పదుడు అయిన ఈవో ధర్మారెడ్డి, మంగళవారం నుంచే వారం రోజుల సెలవుపై వెళ్లనున్నారు. నిజానికి ఆయన ఫలితాలు వెలువడినప్పుడే సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు తిరస్కరించిన ప్రభుత్వమే ఇప్పుడు సెలవుపై పంపిస్తోంది. అయితే రాష్ట్రం దాటకుండా అందుబాటులోనే ఉండాలని ఆయనను హెచ్చరించింది. ఈ వారం రోజుల తర్వాత ధర్మారెడ్డి మళ్లీ టీటీడీ ఈవోగా విధుల్లోకి రావడం ఉండదని, అటునుంచి అటే ఆయనను బదిలీ చేసేస్తారని ప్రచారం జరుగుతోంది.

ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా అత్యంత వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. కేంద్ర రక్షణశాఖకు చెందిన ఈ ఐడీఈఎస్ అధికారి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లోనే.. టీటీడీలో డెప్యుటేషన్ పై టీటీడీలో జేఈవో ఓఎస్డీగా రెండు సార్లు విధులు నిర్వర్తించారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. ధర్మారెడ్డి మళ్లీ టీటీడీ సేవల్లోకి వచ్చారు. కేవలం ధర్మారెడ్డికోసం ఆ పోస్టును అడిషనల్ ఈవోగా అప్ గ్రేడ్ చేశారు కూడా. తర్వాత ఈవోగా ఫుల్ చార్జి కూడా ఆయనకే అప్పగించారు.

జగన్ తో ఉన్న దగ్గరితనాన్ని అడ్డుపెట్టుకుని ధర్మారెడ్డి తిరుమలలో చెలరేగిపోయారనే విమర్శలు చాలా ఉన్నాయి. తన అవినీతిని ప్రశ్నించిన ఎవ్వరినైనా సరే.. ప్రోటోకాల్ నియమాలకు కూడా విరుద్ధంగా దైవదర్శనాల విషయంలో ఇబ్బందిపెట్టేవారు. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ధర్మారెడ్డి కబంధహస్తాలనుంచి తిరుమలేశునికి విముక్తి లభించనుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈనెల 30న ఆయన పదవీవిరమణ చేయనుండగా, ఆలోగానే ఆయనను ఈ పదవినుంచి పక్కకు తప్పిస్తారని, కేంద్రానికి సరెండర్ చేస్తారని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories