ఉచితం సమాజాన్ని చెడగొడుతుంది బాబు గారూ!

అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళలకు నాలుగు నెలలకు ఒకటి వంతున ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసే దీపం పథకానికి చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ అన్న క్యాంటీన్ల గురించి కూడా చెప్పుకొచ్చారు. త్వరలో ఈ క్యాంటీన్ల ద్వారా ఉచితంగానే భోజనం అందించే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనాలు కల్పించడం మంచి ఆలోచనేనా? సమాజంలో ఒక వర్గాన్ని పూర్తిగా నిస్తేజంగా తయారుచేసినట్టు అవుతుంది కదా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

అన్న క్యాంటీన్లలో అయిదురూపాయలకే భోజనం పెట్టడం అనేది నిరుపేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. పేదవాడి ఆకలి తీర్చే మంచి పని అది. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే పేదవాడి కడుపుకొట్టే నిర్ణయం తీసుకున్నారు. ఈ అన్న క్యాంటీన్లను ఎత్తివేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక తిరిగి ప్రారంభించడం గొప్ప సంగతి.

అయితే మళ్లీ మళ్లీ ప్రభుత్వాలు మారినప్పుడెల్లా పేదవాడి ఆకలి తీర్చే పథకం డోలాయమాన పరిస్థితుల్లో పడే ప్రమాదం లేకుండా చంద్రబాబునాయుడు ఈసారి సుస్థిరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ట్రస్టు ఏర్పాటుచేసి ఆ ట్రస్టు ద్వారానే వీటి నిర్వహణను అమలు చేస్తున్నారు. వదాన్యులు ఆ ట్రస్టుకు విరాళాలు ఇవ్వవచ్చునని పిలుపు ఇచ్చారు. ఈ రకంగా అన్న క్యాంటీన్ల ట్రస్టుకు విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఒక కోటి ఇచ్చిన వారి పేర ఏడాదిలో ఒకరోజు అన్న క్యాంటీన్ల నిర్వహణ జరుగుతుంది.

అయితే ఈ భోజనాలను పూర్తిగా ఉచితంగా చేసేయాలని చంద్రబాబు ఆలోచించడం పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. పూర్తి ఉచితంగా పెడితే అది అన్నదానం లాగా అవుతుంది. క్యాంటీన్లో తినే వారికి.. ఒకవేళ నాణ్యత విషయంలో చిన్న తేడాలు వచ్చినా కనీసం ప్రశ్నించే అధికారం కూడా ఉండదు. ఉచితంగా పెట్టడం అనేది వ్యవస్థను దెబ్బతీయడం అవుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్న క్యాంటీన్లలో అయిదురూపాయలకు ఇవ్వడమే ఆల్మోస్ట్ ఉచితంగా ఇచ్చినట్టే. ఇక ఉచితంగా పెట్టేయడం అనేది సోమరులను తయారుచేయడం అవుతుందనే అభిప్రాయం ఉంది. అలాగని అన్న క్యాంటీన్ల వ్యవస్థను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సంఖ్య పెంచాలి. ఉచితంగా ఇవ్వడం కాకుండా.. ఇదేమాదిరిగా 5 రూపాయలకు భోజనం పెడుతూ.. క్యాంటీన్ల సంఖ్య పెంచి, ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు మూడు ఉండేలా చేస్తే ఎక్కువ మందికి ఆ సేవలు అందుతాయి. వీలైతే ప్రతి మండలంలో ఒకటి నిర్వహించవచ్చు గానీ.. ఉచితంగా అన్నదానం తరహాలో నిర్వహిస్తూ పరిమిత క్యాంటీన్లను నిర్వహించడం వలన.. అన్న క్యాంటీన్ పేదవాడి భోజనం అనే స్ఫూర్తి దెబ్బతింటుందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories