మహిళల ఉచిత బస్సు సౌకర్యం గురించి బాబు ప్రభుత్వం కసరత్తు!

ఏపీలో మహిళల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత నెల 13న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 కీలక హామీలపై సంతకం చేశారు. మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేయగా, ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రంపై ఐదో సంతకం చేయడం తెలిసిన విషయమే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ దిశగా బాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ ఆడపడుచులకు కానుకగా అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నారు. గత నెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబు.. సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంపై రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ హాలులో ఉదయం 11గంటలకు ఈ సమావేశ జరగనుండగా పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు ప్రయాణంపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులను పురమాయించిన చంద్రబాబు పలు నివేదికలను తెప్పించుకున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories