వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి నాలుగోతరం రాజకీయ ఎంట్రీకి కూడా రంగం సిద్ధం అవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మూడోతరం వారసత్వం క్లెయిం చేసుకుంటూ.. రాజకీయ ఎంట్రీ కి సంబంధించి ప్రకటన వచ్చేసింది. జగనన్న 2.0 ప్రభుత్వం ఒకవేళ ఏర్పడితే.. ఆ తరువాత ముప్ఫయ్యేళ్ల పాటు తాను మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటానని భ్రమల్లో బతుకుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటిదాకా తన వారసుల్ని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు కదా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఆ పనిని ఆయన చెల్లెలు పూర్తిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. తన కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ గురించి సూత్రప్రాయంగా ప్రకటన చేసేశారు. ఏపీ రాజకీయాల్లోకి తన కొడుకు ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ఆమె చెప్పారు. అదే జరిగితే.. వైఎస్ఆర్ ఫ్యామిలీనుంచి నాలుగోతరం రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతుంది.
రాష్ట్రంలో సరైన గిట్టుబాటు ధర లేకుండా ఇక్కట్ల పాలవుతున్న ఉల్లి రైతులను పరామర్శించడానికి ఏపీసీసీ సారధి వైఎస్ షర్మిల పర్యటన చేశారు. ఆమె వెంట కొడుకు రాజారెడ్డి కూడా ఉన్నారు. ఉల్లి రైతులను పరామర్శించిన షర్మిల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లోకి తన కొడుకు ఎంట్రీ ఉంటుందని తేల్చిచెప్పారు.
రాజారెడ్డి అంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి పేరే. ఆ కుటుంబానికి, ఆ కుటుంబం యొక్క రాజకీయ వైభవస్థితికి మూల పురుషుడిగా రాజారెడ్డి గురించే చెప్పుకోవాలి. పులివెందులలో స్థిరపడిన ఆయన స్థానికంగా ముఠా రాజకీయాల్ని, ఫాక్షనిజాన్ని పెంచి పోషించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పులివెందుల సర్పంచిగా కూడా పనిచేశారు. కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత ఎంపీగా సుదీర్ఘకాలం పనిచేసిన వైఎస్ఆర్, రెండు దఫాలు ఏపీకి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన జీవించి ఉండగానే.. వైఎస్ కుటుంబంలో మూడో తరంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి వారసుడిగా, చిన్నాన్న వివేకానందరెడ్డిని లూప్ లైన్లోకి నెట్టి.. కడప ఎంపీ అయ్యారు. తండ్రి మరణించిన తర్వాత.. తక్షణం తానే ముఖ్యమంత్రి కావాలని కూడా జగన్ కలగన్నారు. అందుకు అడ్డదారుల్లో చక్రం తిప్పారు గానీ.. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఆ కుటిల ఎత్తుగడలు ఫలించలేదు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని.. అధికారం కోసం వక్ర రాజకీయం చేసిన వ్యక్తిగా జగన్ మిగిలిపోయారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ.. 2019 వరకు ఆయనకు అధికారం దక్కలేదు. వైఎస్ కొడుకుగా.. ఒక చాన్స్ ఇచ్చిన తెలుగు ప్రజలు.. అయిదేళ్ల విధ్వంసక పాలన చూసిన భయపడి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. మరో ముప్ఫయ్యేళ్లపాటు ముఖ్యమంత్రిని నేనే అని చెప్పుకుంటూ విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత మొహం చెల్లడం లేదు. అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. ఇలాంటి సమయంలో ఆయన వారసుల్ని ప్రకటించడం కష్టమే. ఆయనకున్న ఇద్దరు కూతుళ్లు ఇప్పటిదాకా రాజకీయ వేదికల మీదికి కూడా రాలేదు. వారి గురించి జగన్ ప్రస్తావించనూ లేదు.
కానీ వైఎస్ ఫ్యామిలీనుంచి నాలుగోతరం ఎంట్రీ ప్రకటన ను షర్మిల చేసేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. మేనల్లుడి రాజకీయ ఎంట్రీ గురించి మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.