ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానున్న నేపథ్యంలో మూడు పార్టీలు కూడా అధికారాన్ని పంచుకునే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం- కూటమికి సారథ్యం వహిస్తుండగా భారతీయ జనతా పార్టీ, జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు పొందనున్నారు. కాగా 100% స్కోరు చేయడంతో రికార్డు సృష్టించిన జనసేనకు ఎన్ని క్యాబినెట్ బెర్తులు దక్కుతాయి.. అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది.
పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు ఐదు మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ 2 మంత్రి పదవులు అడుగుతోంది. సరిగ్గా వారి సంఖ్యా బలం దామాషాలోనే మంత్రి పదవులు కూడా కేటాయించాలని అనుకుంటే బిజెపికి ఒకటి లేదా రెండు, జనసేనకి రెండు లేదా మూడు మాత్రమే దక్కుతాయి.
కానీ జనసేన పార్టీ మాత్రం తమకు 5 మంత్రి పదవులు కావాలని పట్టుబడుతుంది. పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నాలుగు మంత్రి పదవులు ఖరారు అయినట్లే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మంత్రి పదవి తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. పవన్ లేకుండానే ఆ పార్టీకి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే నాదెండ్ల మనోహర్, కొణతల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రధానంగా రేసులో ఉండొచ్చునని అనుకుంటున్నారు.