అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి పనులను చూసి తెలుసుకోవాలి. కేవలం మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే కాదు.. నిర్మాణాత్మక అభివృద్ధికి నిర్వచనం ఆయన తెలుసుకోవాలి. మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ.. మూడు రాజధానులు అంటూ.. అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణంకట్టుకోవడం మాత్రమే కాదు. ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో ఆయన తెలుసుకోవాలి. శుక్రవారం నాడు అమరావతికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.. కేవలం అమరావతిలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులకు మాత్రమే కాదు.. విశాఖలో కూడా ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. పర్యాటక రంగం పరంగా .. విశాఖ నగరానికే ఒక కొత్త శోభను జత చేయనున్న ప్రాజెక్టు అది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ ను విశాఖలోని మధురావడలో నిర్మించనున్నారు. 172 కోట్ల రూపాయల కేంద్ర రుణంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు కూడా అమరావతినుంచే ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయిదేళ్లపాటూ రాష్ట్రాన్ని పరిపాలించి.. అభివృద్ధి అనేమాయ మాటలు చెప్పారు తప్ప.. నిర్మాణాత్మక పనులేమీ చేపట్టలేదు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రకటించారు. రుషికొండకు గుండు కొట్టించి.. తన నివాసభవనాలను నిర్మించుకోవడం తప్ప ఆయన అక్కడ చేసిందేమీ లేదు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. విశాఖ పర్యాటక శోభకు కొత్త జోడింపు చేయనుంది.
జీ+4 అంతస్తుల భవనంగా నిర్మించే ఈ యూనిటీ మాల్ కోసం కేంద్రం ఇప్పటికే 86 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రధాని దీనికి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. 2026 మార్చికెల్లా ఈ మాల్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కేంద్ంర ఇచ్చే 172 కోట్లరుణాన్ని 50 ఏళ్ల కాలానికి వడ్డీలేకుండా ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలతోనే తిరిగి చెల్లిస్తారు.
ఐదు ఎకరాల్లో ఈ యూనిటీ మాల్ నిర్మాణం అవుతోంది. రుషికొండ బీచ్ కు 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని దీన్ని నిర్మించనున్నారు. మొదటి రెండు అంతస్తుల్లో 62 దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వేదికగా ఈ యూనిటీ మాల్ ను తీర్చిదిద్దుతారు. మూడో అంతస్తు నుంచి సీవ్యూ ఏర్పాటు ఉంటుంది. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్లెట్లు ఉంటాయి. వినోద సదుపాయలు, బ్యాంకులు, ఫిట్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు అవుతాయి. పర్యాటకులకు కొత్త హంగుగా ఇది కనిపిస్తుంది. నిర్మాణాత్మకంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి తప్ప.. జగన్ మాటలతో మోసం చేయాలనుకుంటే కలకాలం ఆ పప్పులుడకవు అని ప్రజలు అంటున్నారు.