తప్పుడు పనులు చేయడం, తన మీద పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే వారి నుంచి నోటీసులు అందుకోవడానికి కూడా భయపడి కుటుంబంతో సహా పరారు కావడం.. ఒక రెగులర్ ప్రాక్టీస్ గా మారుతోంది. ఇప్పుడు అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే కాదు. ఇలా పరారు కావడంలో ఆయనను మించిన మరో వైసీపీ నాయకుడు కూడా ఉన్నారు. ఆయనే మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి! అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చెలరేగిపోయి తప్పుడు పనులు చేయడం.. ఆ తర్వాత పరారై కలుగులో దాక్కోవడం అలవాటైన అనేక మంది వైసీపీ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు కాకాణి కూడా కలుగులో దాక్కున్న పరారీ జీవితం చాలించి.. ఇక బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని, ఆయనకు కూడా వేరే గత్యంతరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అరెస్టు నుంచి రక్షణ కావాలని, ముందుగానే బెయిలు కావాలని హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ విషయంలో తాజా తీర్పు.. ఇలాంటి అభిప్రాయాన్నే అందరికీ కలిగిస్తోంది.
పొదలకూరు మండలం వరదాపురం పరిధిలో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ సాగించిన కేసులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై ఉన్నాయి. ఆయన అక్రమాలు అరాచకాలు బయటకు వచ్చిన సందర్భంలో ఆయన చాలా ప్రగల్భాలు పలికారు. పోలీసులు బట్టలు ఊడదీయించి కొట్టిస్తానని రెచ్చిపోయారు. తీరా పోలీసులు విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినప్పటినుంచి పరారీలోనే ఉన్నారు. సమాంతరంగా కోర్టు ద్వారా రక్ష్ణణ పొందడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
తాజాగా ఆయన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. ఇప్పట్లో తేలాలే కనిపించడం లేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను హైకోర్టు ఏకంగా తిరస్కరించింది.
అలాగే.. ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్దు బెయిలు పిటిషన్ విచారణ పరిధి కాకాణి గోవర్దన రెడ్డి, విడదల రజని తదితరులు పిటిషన్ల నేపథ్యంలో ప్రశ్నార్థకం అయింది.
ఇలాంటి కేసుల్లో ముందుగా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించి, అక్కడ రిజెక్టు అయిన తర్వాతనే ముందస్తు బెయిలు కోసం హైకోర్టు కు రావచ్చునని, నేరుగా హైకోర్టుకు రాజాలరని గతంలో ఒక తీర్పు ఉంది. అయితే నేరుగా హైకోర్టుకు రావచ్చునంటూ కాకాణి గోవర్దనరెడ్డి సహా మరో మాజీ మంత్రి విడదల రజని వంటి వారు పిటిషన్లు వేశారు. దాంతో ఈ ఎస్సీ ఎస్టీ కేసుల్లో బెయిలు అడిగే పిటిషన్ల విచారణ పరిధిని నిర్ణయించే విషయాన్ని ధర్మాసనానికి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. విచారణ పరిధిని ధర్మాసనానికి అప్పగించినందున.. ముందస్తు బెయిలు మంజూరుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని న్యాయమూర్తి చెప్పారు.
దాంతో కాకాణి గోవర్దనరెడ్డికి షాక్ తగిలినట్టే. అటు అరెస్టు నుంచి రక్షణను తిరస్కరించారు. ఇటు ముందస్తు బెయిలు వ్యవహారం ధర్మాసనానికి వెళ్లింది. సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నా కూడా కేవలం అరెస్టు నుంచి రక్షణ కోసం మాత్రమే వెళ్లాలి. సానుకూల తీర్పు వస్తుందో లేదో తెలియదు. ఇంకా ఎంతకాలం పరారీలో ఉండాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ కసిరెడ్డి తనంతగా బయటకు వచ్చినట్టే.. కాకాణి గోవర్దనరెడ్డి కూడా తనంతగా కలుగులోంచి బయటకు రావాల్సిన రోజు దగ్గరిలోనే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.