కాదంబరి కేసులో అరెస్టు.. ఇంకా చాలా కేసులు వెయిటింగ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో జరిగిన అనేకానేక అక్రమాలు, అరాచకాలకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఒక కేసులో సస్పెండు అయిన తరువాత కూడా.. నిబంధనల ప్రకారం ఏపీ దాటి వెళ్లకూడదని ఉన్నప్పటికీ, హైదరాబాదులో తిష్ట వేసి, కేసుల్లో ఇరుక్కుని ఉన్న వైసీపీ నాయకులకు ఎలా తప్పించుకోవాలో.. పరారీలో ఉంటూ పోలీసులకు దొరక్కుండా ఎలా రక్షణ పొందాలో.. కోర్టుల్లో ఎలా కేసులు వేయాలో తెరవెనుకనుంచి గైడ్ చేస్తూ గడుపుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముంబాయి నటి కాదంబరి జత్వానీ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టుచేయించిన వ్యవహారంలో ఆయన అరెస్టు అయ్యారు. ప్రస్తుతానికి ఇదొక్కటే! రఘురామక్రిష్ణ రాజును కస్టడీలో హత్యచేయడానికి యత్నించిన కేసు వంటి వాటిలోనూ ఆయన నిందితుడు. కాదంబరి వ్యవహారం విచారణపర్వం ఒక కొలిక్కి వచ్చేలోగా ఆయా కేసుల్లో కూడా పీటీ వారెంటు ద్వారా మళ్లీ అరెస్టు చేసే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

ముంబాయి నటి కాదంబరి జత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు రెండో నిందితుడు. అప్పట్లో వైసీపీ ముఖ్యనేత చెప్పగానే రంగంలోకి దిగిన ఆయన ఎలాంటి అక్రమ కేసులు పెట్టించాలి, ఎలా అరెస్టు చేసి వేధించాలి.. అనే అన్ని వ్యవహారాలు తానే దగ్గరుండి చూసుకున్నారు. ఆయన స్కెచ్ ప్రకారం కుక్కల విద్యాసాగర్ ను పిలిపించి కాదంబరిపై- తన ఆస్తిని ఆమె తప్పుడు పత్రాలతో విక్రయించినట్టుగా కేసు పెట్టించారు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కాదంబరి జత్వానీ, ఆమె తల్లి దండ్రులను కూడా ముంబాయిలో అరెస్టు చేయించారు. ఈ వ్యవహారాలను మరో ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ స్వయంగా చూసుకున్నారు.

కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వానీ వచ్చి ఫిర్యాదు చేయడంతో.. అన్ని వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. పీఎస్సార్ ఆంజనేయులు తనను పిలిస్తేనే సీఎంఓకు వెళ్లానని, ఆరోజు ముంబాయికి తన ఫ్లైటు టికెట్లు కూడా సీపీ ఆఫీసులోనే కొన్నారని విశాల్ గున్నీ ఇచ్చిన స్టేట్మెంటు ఆధారంగానే కేసు ముందుకు సాగుతోంది. ఈ ముగ్గురు ఐపీఎస్ లు ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు. పీఎస్సార్ ఆంజనేయులు మాత్రం.. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రం దాటి వచ్చి హైదరాబాదులో ఉంటున్నారు. వైఎస్ జగన్ కు ఎంతో సన్నిహితుడిగా పేరు పడ్డ ఆయన ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు కేసుల నుంచి తప్పించుకోవడంలో గైడెన్స్ ఇస్తున్నారనే పేరుంది. ఇవాళ ఆయనను ఏపీసీఐడీ పోలీసులు కాదంబరికేసులో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. రఘురామపై హత్యాయత్నం కేసు, మరి కొన్ని కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. త్వరలోనే పీటీ వారెంట్లు తీసుకుని ఆ కేసుల్లో కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories