కడప ఎంపీ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీచేయడం ఖరారు అయిపోయింది. అధికారికంగా కాంగ్రెసు పార్టీ జాబితాను కూడా ప్రకటించింది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల నివాళి అర్పించి.. వైసీపీ తరఫున పోటీచేస్తున్న తమ్ముడు అవినాష్ రెడ్డి మీద, ఆయనను గెలిపించడానికి కంకణం కట్టుకున్న అన్నయ్య జగన్మోహన్ రెడ్డి మీద సమరశంఖం పూరించారు. కడప ఎంపీ బరిలో రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన, సంచలనాత్మక పోటీకి ఆమె తెర తీశారు.
ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసునని, వారికి చంద్రబాబునాయుడు మద్దతు ఇస్తున్నారని పడికట్టు మాటలతో, నర్మగర్భపు వ్యాఖ్యలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు జగన్ అలా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ ఉండగా మరొకవైపు షర్మిల డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు. వివేకాను చంపించిన అవినాష్ రెడ్డిని ఓడించడానికే తాను ఎన్నికల బరిలోకి దిగినట్టుగా చెబుతున్నారు.
తనను కడప ఎంపీగా చూడాలనేది వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన్న ఆఖరి కోరిక అని వైఎస్ షర్మిల చెబుతుండడం విశేషం. హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందే.. చిన్నాన్న వివేకా తన దగ్గరకు వచ్చి, కడప ఎంపీ పదవికి పోటీచేయాల్సిందిగా కోరారని షర్మిల చెప్పారు. అందువల్లనే ఆయనను అవినాష్ రెడ్డి చంపిచినట్లుగా కూడా ఆమె చెప్పారు. చిన్నాన్న చివరి కోరికను తీర్చడానికే తాను.. ఆయనను హత్య చేసిన వారితో తలపడుతున్నానని చెప్పిన షర్మిల మాటలు కడప ప్రజల్లో కొత్త ఆలోచనను కలిగిస్తున్నాయి.
ఎవరు చంపారో ప్రజలకు తెలుసు- లాంటి ఇండైరక్టు మాటల జోలికి షర్మిల వెళ్లడం లేదు. చాలా సూటిగా చిన్నాన్నను చంపించిన అవినాష్ రెడ్డిని గెలిపించడానికి జగనన్న కష్టపడుతున్నాడే.. చిన్నాన్న ఆత్మ క్షోభించకుండా ఉంటుందా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. జగన్ కూడా ‘చిన్నాన్న వివేకా’ను తన ప్రచారాస్త్రంగా వాడుకోవాలని అనుకుంటూ ఉండగా.. షర్మిల కూడా అదే చిన్నాన్నను తన బ్రహ్మాస్త్రంగా అవినాష్ పై ప్రయోగిస్తుండడం గమనించదగిన విషయం.
ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల , అవినాష్ రెడ్డి హంతకుడు అంటూ ఎంత నిర్దాక్షిణ్యంగా విమర్శలతో విరుచుకుపడబోతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె దూకుడు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎన్నికల ప్రచారంలో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత కూడా జత చేరే అవకాశం పుష్కలంగా ఉంది. కడప జిల్లాల్లో ప్రస్తుతం మూడుస్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పులివెందులలో జగన్ పై తలపడేది ఎవరో ఇంకా తేల్చలేదు. వివేకా కుటుంబసభ్యులకే అక్కడ కూడా టికెట్ ఇస్తే గనుక.. ఈ పోటీలు ఇంకా రసవత్తరంగా మారుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.