టాలీవుడ్ నుంచి మరో విషాద వార్త వచ్చింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
ఎప్పుడూ నవ్విస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అలరిస్తూ వచ్చిన వెంకట్, కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా కొన్ని నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పించారు. కానీ అనారోగ్యం మాత్రం ఆయనను నెమ్మదిగా కబళించింది. చాలా కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం డబ్బులు, అవయవాల కొరత కూడా ఎదురైంది. చివరికి శరీరం చికిత్సకు స్పందించక నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.
ఫిష్ వెంకట్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతటి చిన్న పాత్ర అయినా తన స్టైల్‌తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఆయనలో ఉండేది. అలాంటి ఓ నటుడు ఇలా ఆకస్మికంగా వెళ్లిపోవడం తెలుగు ప్రేక్షకులను కలచివేస్తోంది.
వెంకట్ మృతితో సినిమారంగం ఒక్కసారి మూగబోయింది. ఆయనతో పని చేసిన నటీనటులు, డైరెక్టర్లు శోకంలో మునిగిపోయారు. చాలా మందికి ఇప్పటికీ ఈ వార్త నమ్మశక్యంగా అనిపించడం లేదు.