డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీలోని పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. వారి పనితీరులో మార్పు రాకపోతే గనుక.. హోంశాఖ పగ్గాలు కూడా తానే తీసుకుంటానని హెచ్చరించారు. తాను హోం శాఖ చేపడితే గనుక.. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా ఉండవని..అంతా వేరుగా ఉంటుందని హెచ్చరించారు. నేరాలను అరికట్టడంలో, నేరస్తులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు ఉదాసీన వైఖరి అనుసరిస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
మహిళలు, అమ్మాయిలు, చిన్నారుల పట్ల జరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత వేగంగా ఈ కేసులు పరిష్కారం కాకపోతుండడాన్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తే.. వీటిని రాజకీయ వివాదంగా మార్చడానికి కొందరు కుటిల ప్రయత్నం చేస్తుండడం కూడా జరుగుతోంది. పవన్ కల్యాణ్ హోం శాఖ తీసుకోవాలని అనుకుంటున్నారంటూ… హోం మంత్రి అనిత విఫలమైనట్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని భాష్యాలు చెబుతున్నారు. అవన్నీ పక్కన పెడితే.. పోలీసుశాఖ పనితీరులో మార్పు రావాల్సిన ఆవశ్యకతను పవన్ మాటలు తేల్చిచెబుతున్నాయని మాత్రం అర్థం చేసుకోవాలి.
పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు అలసత్వం వీడాల్సిన అవసరం కూడా ఉంది. నిస్తేజంగా పనిచేసుకుంటూ పోయే ధోరణి మారాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులే కదా ఇప్పుడు కూడా ఉన్నారు.. కాకపోతే కొందరు అటూఇటూ స్థానాలు మారారు అంతే అంటూ పవన్ కల్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేఝశారు. నిజానికి పోలీసుల అలసత్వానికి చాలా ఉదాహరణలే ఉంటున్నాయి.
ఎన్డీయే సర్కారు ఏర్పడక ముందు ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన కేసుల్లోని నిందితులైన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పరారీలో ఉంటే.. వారిని ఇప్పటిదాకా పట్టుకోలేకపోతున్నారు. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన వారి అరెస్టు గురించి అడిగినప్పుడు కులపరమైన సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పడం పవన్ కల్యాణ్ కు ఆగ్రహం తెప్పించినట్టుంది. క్రిమినల్స్ కు కులం, మతం ఉండవని, తప్పుచేసిన వారు ఎవ్వరైనా సరే.. వారికి శిక్షలు పడి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ హెచ్చరించడం గమనార్హం.
తప్పులు చేసిన వారు తన బంధువులని తెలిసినా తన కులం, తన రక్తం అని చెప్పినా విడిచిపెట్టవద్దని పవన్ కల్యాణ్ అంటున్నారు.క్రిమినల్స్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ వ్యవహరించిన తీరులో వ్యవహరిస్తే తప్ప.. వారిలో మార్పు రాదని ఆయన అంటున్న మాటల స్ఫూర్తిని పోలీసులు అర్థం చేసుకోవాల్సి ఉంది. పవన్ వ్యాఖ్యలను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నం చేయకుండా, పోలీసులు తమ అచేతనత్వం వీడి చురుగ్గా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.