తెదేపా తరఫున క్షేత్రస్థాయి ప్రచార సారథులు!

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు క్లిష్టమైన సమస్యను అధిగమించే ప్రయత్నంలో ఉంది. పార్టీ సాగించే ఎన్నికల ప్రచారం తరహాలో కాకుండా.. సమూహాలుగా, ఆర్బాటంగా వెళ్లే బృందాలు కాకుండా.. ఒక్కొక్కరుగా విడివిడిగా ప్రజల వద్దకు వెళ్లి.. చంద్రబాబు నాయకత్వం గురించి తెలియజెప్పి.. వారిని ప్రభావితం చేసి.. వారితో పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించగల వారికోసం పార్టీ వెతుకులాడుతోంది. భిన్నమైన వ్యూహంతో పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించుకోవాలని ఆరాటపడుతోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. ప్రజలను ఆకర్షించడానికి.. ఓటు బ్యాంకును గంపగుత్తగా తనవైపు మరల్చుకోవడానికి అనేక హామీలను ప్రకటించారు.  సంక్షేమ పథకాల డబ్బు  పొందుతున్న ఏ లబ్ధిదారులనైతే జగన్ తన స్థిరమైన ఓటు బ్యాంకుగా భావిస్తున్నారో.. ఆ ఓటు బ్యాంకును మొత్తం టోకుగా తనవైపు తిప్పుకోగల అద్భుతమైన వరాలను చంద్రబాబునాయుడు ప్రకటించారు.

వృద్ధులకు 3వేలు పెన్షన్ అందుతుండగా.. తాను అధికారంలోకి రాగానే 4 వేలు ఇస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఇలాంటి హామీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. పైగా.. తాను జూన్ లో అధికారంలోకి వచ్చినాసరే.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు అరియర్స్ కూడా జులై నెల నాలుగువేలతో పాటు చెల్లిస్తానని చంద్రబాబు చెప్పడం వృద్ధుల మీద ఆకర్షణీయమైన అస్త్రమే. అలాగే వికలాంగులకు తమ ప్రభుత్వంలో 6 వేల రూపాయల పెన్షను అందిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది కూడా చిన్న సంగతి కాదు. ఇవన్నీ ఇళ్లవద్దకే చేరవేస్తానని కూడా చెప్పారు.

హామీలైతే గొప్పగా ఉన్నాయి గానీ.. ఇవన్నీ లబ్ధిదారుల వద్దకు చేరడం, వారు నమ్మేలా వారికి తెలియజెప్పడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. జగన్ తీసుకువచ్చిన వాలంటీరు వ్యవస్థ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలుస్తూ.. వారిని జగన్ కు అనుకూలంగా ప్రభావితం చేయడానికి చాలా కాలంగా పనిచేస్తూ వస్తోంది. అలాంటిది వారి మాటలను తోసి రాజని, చంద్రబాబు అదే లబ్ధిదారులకు అంత కంటె గొప్ప మేలు, అంతకంటె మెరుగైన విధానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అలాంటి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వారికి అర్థమయ్యేలా తెలియజెప్పడం చాలా కీలకం. పైగా పని మీద ఇతర ఊర్లలో ఉండే బిడ్డల వద్దకు వెళ్లే వృద్ధులు పింఛను సమయానికి ఉరుకులు పరుగుల మీద ప్రతినెలా స్వగ్రామానికి తిరిగిరావాల్సిందే. జగన్ పాలనలో ఒక్కనెల పింఛను తీసుకోకపోయినా అది రద్దయిపోతుంది. అయితే చంద్రబాబు మాత్రం రెండు నెలలు తీసుకోకపోయినా కూడా మూడో నెలలో మొత్తం ఇస్తానని ప్రకటించడం అలాంటి చాలా మందికి నమ్మకం కలిగిస్తుంది. ఆశ పుట్టిస్తుంది. అయితే ఈ హామీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి ప్రచార సారథులకోసం చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories